జనసేన అధినేత సోషల్ మీడియాను బాగా నమ్ముకుంటున్నట్లున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన పిలుపుకు స్పందిస్తున్న జనాలను చూసి పవన్ ఫుల్లుగా హ్యాపీ అయిపోతున్నారు. రోడ్ల దుస్ధితిపై పవన్ ఇచ్చిన పిలుపుకు స్పందించి మొదటిరోజే అంటే 15వ తేదీన 3.55 లక్షల ట్విట్లు వచ్చాని పార్టీ ప్రకటించింది. అలాగే తొలిరోజు ట్విట్లు 218 మిలియన్లమందికి చేరినట్లు కూడా ప్రకటించింది. అంటే మూడురోజుల నిరసనలో మొదటిరోజే 21 కోట్లమందికి తమ ట్వీట్లు చేరినట్లు పార్టీ జబ్బలు చరుచుకుంటోంది.
ఇక్కడే పార్టీతో పాటు పవన్ కూడా బోల్తాపడుతున్నారు. పవన్ కు రాజకీయాల్లో కన్నా సినిమాల్లోనే అభిమానులు ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాన్ పేరుతో ఫేస్ బుక్ లో ఉన్నన్ని గ్రూపులు, గ్రూపుల్లోని లక్షలాదిమంది సభ్యులు మరే స్టార్ కు లేరన్నది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ రాజకీయాల్లోకి దిగారు. 2014 ఎన్నికల్లో కేవలం బీజేపీ, టీడీపీకి మద్దతు మాత్రమే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీలు గెలవటంతో తనను తాను పవన్ చాలా ఎక్కువగా ఊహించేసుకున్నారు.
తన అభిమానులంతా ఓట్లేయటం వల్లే టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చాయనే భ్రమల్లో కూరుకుపోయారు. తన అభిమానుల మద్దతు చూసుకునే 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లోకి దిగారు. తీరాచూస్తే ఏమైంది ? పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో పాటు తాను పోటీచేసిన రెండుచోట్లా పవన్ ఓడిపోయారు. అంటే సినిమాల్లో ఫ్యాన్స్ వేరు రాజకీయంగా ఓట్లేసే జనాలు వేరన్న విషయం అప్పటికి కానీ పవన్ కు అర్ధంకాలేదు. ఇపుడు పవన్ చేస్తున్న ట్విట్లు రీ ట్వీట్లవుతున్నాయంటే అందుకు కారణం సినిమా అభిమానులే అని గ్రహించాలి.
సినిమా అభిమానుల్లో చాలామంది జనసేనకు ఎన్నికల్లో ఓట్లేయటంలేదు. ఎందుకంటే ఫ్యాన్సుల్లో అత్యధికులు పిల్లపిలకాయాలే కాబట్టి వాళ్ళకు ఓట్లుండదు. ఓట్లులేని వాళ్ళు ఎంతమంది జై కొట్టినా సోషల్ మీడియాలో లైకులు, రీ ట్వీట్లు చేసినా జనసేనకు ఉపయోగం ఏమిటి ? సో వీళ్ళని నమ్ముకుంటే పవన్ రెండోసారి కూడా ముణిగిపోవటం ఖాయమని ఎంత తొందరగా తెలుసుకుంటే అంతమంచిది.