జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతు ప్రకటించటం ద్వారా కేంద్రప్రభుత్వం చంద్రబాబునాయుడుకు షాకిచ్చింది. కర్నూలుకు హైకోర్టును తరలించటంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతు హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు అందినట్లు చెప్పారు. ఈ విషయంలో హైకోర్టు-రాష్ట్రప్రభుత్వం మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి వస్తే సరిపోతుందన్నారు. తర్వాత తమకు ఈమేరకు ప్రభుత్వం ప్రతిపాదన పంపితే సరిపోతుందని స్పష్టంగా చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే మూడురాజధానుల కాన్సెప్టు ముందుకు వెళ్ళకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు కోర్టులో కేసులు వేయించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. న్యాయస్ధానం జోక్యం కారణంగానే మూడు రాజధానుల ప్రతిపాదనను తాత్కాలికంగా జగన్ ఆపారు. రాజధాని మార్పుతో తమకు ఎలాంటి సంబంధంలేదని గతంలోనే కేంద్రప్రభుత్వం స్పష్టంగా ప్రకటించేసింది.
అయినా కూడా చాలామంది కావాలనే కోర్టులో పిటీషన్ దాఖలు చేసి కేంద్రప్రభుత్వాన్ని కూడా ఇరికించారు. ఆ విషయంపైనే తాజాగా కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మరో రెండు మూడు నెలల తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నారట.
హైకోర్టును కర్నూలుకు మార్చేందుకు అయ్యే ఖర్చులన్నింటినీ రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. హైకోర్టును తరలింపు ఖర్చును రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని కేంద్రమంత్రి చెప్పారంటేనే మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా తెరవెనుక ఏదో జరుగుతోందనే అర్ధమవుతోంది. దీన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వివిధ వ్యవస్ధల్లో చంద్రబాబుకున్న పట్టంతా మెల్లిగా సడలిపోతోంది. మరో రెండునెలల్లో దాదాపు నిర్వీర్యమైపోవచ్చు. ఆ తర్వాత తన ప్లాన్ ప్రకారం జగన్ పావులు కదిపి అనుకున్నట్లుగా చేసుకుపోతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దానికి నాందిగానే లోక్ సభలో కేంద్రమంత్రి సమాధానం ఉందని అనుకుంటున్నారు. చూద్దాం రెండు మూడు నెలల తర్వాత జగన్ ఏమిచేస్తారో ?