ఇపుడీ విషయమే మామూలు జనాలకు అర్ధం కావటంలేదు. ఇండియా అంటే నరనరాన విధ్వేషాన్ని నింపుకున్న డ్రాగన్, పాకిస్ధాన్ యుద్ధనౌకలు రెండు శ్రీలంకలో లంగరువేయబోతున్నాయి. పై రెండుదేశాలకు చెందిన రెండు యుద్ధనౌకలు కొలంబోలో తిష్టవేయటం మనకు ఏ విధంగా చూసినా క్షేమకరంకాదు. ఒకటేమో చైనాకు చెందిన యువాన్ వాంగ్ 5 యుద్ధ నిఘా నౌక. ఇక రెండోదేమో పాకిస్ధాన్ కు చెందిన పీఎన్ఎస్ తైమూర్ యుద్ధనౌక.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఒకవైపు ఆగష్టు 15వ తేదీన ఢిల్లీలో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ప్రిపరషేన్ జరుగుతున్న సమయంలోనే పై రెండు శతృదేశాల యుద్ధనౌకలు శ్రీలంకలో వచ్చి ఆగుతుండటం నూరుశాతం అనుమానించతగ్గదే. ఇందులో యువాన్ వాంగ్ 5 యుద్ధనౌక అయితే దక్షిణాదిలోని ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ మొత్తంపై నిఘావేయగల సామర్ధ్యం ఉన్నది. అణువార్ హెడ్లు, మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్ల వివరాల కోసం కొలంబోలోని అంబన్ తోగ పోర్టులో లంగరేసిందనే కేంద్రప్రభుత్వం అనుమానిస్తోంది.
పాకిస్ధాన్ యుద్ధనౌ అయితే షాంఘైలో బయలుదేరి కరాచీపోర్టుకు చేరుకోవాలి. షాంఘైలో బయలుదేరిన పీఎన్ఎస్ తైమూర్ కాంబోడియా, మలేషియా, కొలంబో మీదుగా కరాచీకి చేరుకుంటుంది. ఈనెల 12-15 తేదీల మధ్య తైమూర్ కొలంబోలోనే ఉంటుంది. అలాగే వాంగ్ 5 ఈనెల 11 నుండి 17 వరకు ఉంటుంది. భారత్ కు బద్దశతృదేశాల రెండు యుద్ధనౌకలు ఏకకాలంలో శ్రీలంకలో లంగరేసుకునుండటం మనకు ప్రమాదకరమనే చెప్పాలి.
తీవ్రసంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు మనదేశం 5.4 బిలియన్ డాలర్లతో పాటు ఇతరత్రా సాయం చేసినా పై రెండుదేశాల యుద్ధనౌకలు లంగరేసుకోవటానికి అనుమతించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. వాంగ్ 5 యుద్ధనౌకకు అనుమతి ఇవ్వద్దని కేంద్రప్రభుత్వం చేసిన అభ్యంతరాన్ని శ్రీలంక మొదట్లో పరిగణలోకి తీసుకుంది. అయితే తర్వాత పెరిగిపోయిన ఒత్తిడిని తట్టుకోలేక చైనాకు అనుమతిచ్చేసింది. ఈ విషయమై మన రక్షణదళాలు ఎంత అభ్యంతరాలు వ్యక్తంచేసినా ఉపయోగం లేకపోయింది. మరిపుడు మన దళాలు ఏమి చేస్తున్నాయన్నదే ప్రశ్న.