మునుగోడు నియోజకవర్గంలో కొన్ని పోస్టర్లు సంచలనం రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఎంఎల్ఏగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ బీజేపీలో చేరి ఆ పార్టీనుండి పోటీచేయటానికి రెడీ అవుతున్నారు. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఉపఎన్నిక కారణంగా తెలంగాణాలో అనవసరమైన రాజకీయ కాలుష్యం పెరిగిపోతోంది.
సరిగ్గా ఈ సమయంలోనే శనివారం ఉదయం మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ కు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు సంచలనంగా మారింది. ఈ పోస్టర్లో ప్రధానంగా రెండు పాయింట్లున్నాయి. మొదటిదేమో 13 ఏళ్ళ నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహిఅని. రెండో పాయింట్ ఏమిటంటే తెలంగాణా ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షా తో బేరమాడిన నీచుడివి. మునుగోడు నిన్ను క్షమించదంటు నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిసాయి.
13 ఏళ్ళ నమ్మకాన్ని అమ్ముకున్నావనే పాయింట్ కు అర్ధం ఏమిటంటే రాజగోపాల్ కాంట్రాక్టర్. ఛత్తీస్ ఘడ్ లో రాజగోపాల్ కంపెనీకి 22వేల కోట్లరూపాయల బొగ్గు గనుల కేటాయింపు జరిగిందనే ఆరోపణలు బాగా ఉన్నాయి. తాను బీజేపీలో చేరాలంటే తన కంపెనీకి బొగ్గుగనుల కేటాయింపును బేరంగా మాట్లాడుకున్నారనేది రాజగోపాల్ మీదున్న ప్రధానమైన ఆరోపణ. ఇక సోనియాను ఈడీ విచారిస్తున్న సమయంలోనే ఢిల్లీలో రాజగోపాల్ కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయి బేరాలు సెటిల్ చేసుకున్నారని బాగా ఆరోపణలు వినబడుతున్నాయి.
ఇప్పుడు వెలసిన పోస్టర్లు చూస్తే రెండు అనుమానాలు పెరుగుతున్నాయి. మొదటిది కాంగ్రెస్ లో రాజగోపాల్ ప్రత్యర్ధులే పోస్టర్లు అంటించుంటారు. రెండో అనుమానం ఏమిటంటే కాంగ్రెస్ లో అయోమయం సృష్టించేందుకు టీఆర్ఎస్ నేతల పనికూడా అయ్యుండచ్చు. ఏదేమైనా బీజేపీలో చేరేటపుడు తనతో పాటు తన మద్దతుదారులందరు వచ్చేస్తారన్న రాజగోపాల్ అంచనాలు తప్పాయి. మరి రేపటి ఎన్నికల్లో రాజగోపాల్ గ్యారెంటీగా గెలుస్తారా అంటే కాస్త అనుమానమనే చెప్పాలి. రాజగోపాల్-కాంగ్రెస్-టీఆర్ఎస్ మూడింటికి ప్లస్సులు, మైనస్సలు సమానంగా ఉన్నాయి కాబట్టి గెలుపును ఎవరు అంచనా వేయలేరు.