సోదరుడు చిరంజీవిపైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో బాగా ధ్వేషమున్నట్లుంది. లేకపోతే ఎప్పుడో జరిగిపోయిన విషయాలను అదేపనిగా తవ్వితీసి చిరంజీవి ఫెయిల్యూర్లను గుర్తుచేయాల్సిన అవసరంలేదు. ప్రజారాజ్యపార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ లో కలిపేయటం పూర్తిగా చిరంజీవి చేతకానితనమే తప్ప మరోటికాదు. అంతకుముందు 2009 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేసి అత్తగారి నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయారంటే చిరంజీవి చేతకానితనం కాక మరేమిటి ?
తన చేతకాని తనాన్ని చిరంజీవే కన్వీనియెంటుగా మరచిపోయారు. అలాంటిది ఆ విషయాన్ని ఇపుడు పవన్ ఎందుకని పదే పదే ప్రస్తావిస్తున్నారో అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డిని సినిమీ ఇండస్ట్రీ సమస్యల మీద కలిశారు. అప్పుడు జగన్ కు చిరంజీవి నమస్కారం పెట్టడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తితో జగన్ అలా నమస్కారాలు పెట్టించుకుంటారా అంటు నానా గోలచేస్తున్నారు. నమస్కారం పెట్టిన చిరంజీవికి లేని బాధ పవన్ కు ఎందుకు ? చిరంజీవిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని పదే పదే చెప్పటంలో పవన్ ఉద్దేశ్యంఏమిటి ?
ముఖ్యమంత్రవ్వాలనే ఆలోచనకు ముఖ్యమంత్రి అవటానికి ఆవకాయకు ఆవగింజకు ఉన్నంత తేడా ఉంది. ఈ తేడా పవన్ కు అర్ధంకాకపోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు. 2019లో పవన్ కూడా ముఖ్యమంత్రయిపోదామనే అనుకున్నారు, అయ్యారా ? జగన్ అధికారంలోకి ఎలా వస్తారో చూస్తానని సవాలు చేశారు, ఆపగలిగారా ? తనస్ధాయికిమించి తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకోటమే పవన్లో పెద్ద సమస్య అయిపోయింది. ఇదే సమయంలో జగన్ను చాలా తక్కువ అంచనా వేయటం మరోసమస్య.
ఈ రెండు సమస్యల్లో నుండి బయటపడలేక చిరంజీవిని అవమానించారని ఇపుడు నానా గోలచేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యంగోల ఇపుడెందుకు ? జనాలు మరచిపోయిన చిరంజీవి ఫెయిల్యూర్ ను పవన్ కావాలనే అందరికీ గుర్తుచేస్తున్నట్లుంది. ఎవరూ పీడకలలను గుర్తుచేసుకోవాలని అనుకోరనే కనీసజ్ఞానం కూడా పవన్లో కనిపించటంలేదు. చిరంజీవి కూడా గుర్తుచేసుకోవటానికి ఇష్టపడని ఫెయిల్యూర్ ను కావాలని కెలుకుతున్నారంటేనే సోదరుడిపై పవన్ కు ఎంత ధ్వేషముందో అర్ధమైపోతోంది.