వచ్చే ఎన్నికలు చంద్రబాబునాయుడుకి ఎంత క్రూషియలో జగన్మోహన్ రెడ్డికీ అంతే ముఖ్యం. ఇక్కడ జగన్ ముందున్న సవాళ్ళేమిటంటే అసెంబ్లీలో మెజారిటి సీట్లు సాధించటంతో పాటు పార్లమెంటు సీట్లు కూడా వీలైనన్ని తెచ్చుకోవాలి. అధికారంలోకి రావటంతో పాటు పార్లమెంటు సీట్లు ఎక్కువగా తెచ్చుకోవాలంటే కచ్చితంగా అభ్యర్ధుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపధ్యంలోనే ఒకటికి పదిసార్లు సిట్టింగులతో పాటు సీనియర్లపై సర్వేలు చేయించుకుంటున్నారు.





రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందంతో పాటు వివిధ మార్గాల్లో జగన్ సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. పార్టీ నేతల సమాచారం ఏమిటంటే కనీసం 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులుంటాయట. అలాగే 10 మంది సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చేయబోతున్నారని సమాచారం.  అనంతపురం, హిందుపురం, నెల్లూరు, బాపట్ల, ఏలూరు, అమలాపురం, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ సిట్టింగుల స్ధానంలో కొత్తవారికి అవకాశాలు దక్కుతాయని తెలుస్తోంది.





సిట్టింగ్ ఎంపీల స్ధానంలో కొత్తవారిని తీసుకురావాలని అనుకుంటున్నారంటే అందుకు మూడు కారణాలున్నాయి. మొదటిదేమో ఎంపీల్లో కొందరు ఎంఎల్ఏలుగా పోటీచేయాలని అనుకుంటున్నారు. రెండోది కొందరు ఎంపీలపై ఆరోపణలున్నాయి. అలాంటివాళ్ళకే మళ్ళీ టికెట్లిస్తే గెలవటం కష్టమని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. కొందరు ఎంఎల్ఏలను జగన్ ఎంపీలుగా పోటీచేయించాలని అనుకుంటున్నారట. ఇలాంటి కారణాల వల్ల సుమారు 10 నియోజకవర్గాల్లో మార్పులుంటాయని  నేతలు చెబుతున్నారు.





వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీలను గనుక గెలిపించుకుంటే కేంద్రంలో తనమాట చెల్లుబాటవుతుందని జగన్ భావిస్తున్నారట. అయితే ఇపుడు 22 మంది ఎంపీలున్నా మాట పూర్తిస్ధాయిలో చెల్లుబాటు కావటంలేదు. వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లొచ్చినంత మాత్రమే ఢిల్లీలో మాట చెల్లుబాటు కాదు. బీజేపీ లేదా ఎన్డీయేకి సరిపడా బలం లేకపోతే మాత్రమే జగన్ లాంటి నేతల మాట చెల్లుబాటయ్యే అవకాశముంది. బీజేపీకి పూర్తిస్ధాయి బలం వచ్చేస్తే తన మాట చెల్లుబాటు చేయించుకోవాలంటే జగన్ మరో ఐదేళ్ళు వెయిట్ చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: