కాంగ్రెస్ పార్టీకి  ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) దెబ్బ మామూలుగా పడటంలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేచి నిలబడదామని అనుకున్నా వెంటనే ఆప్ గట్టిదెబ్బ కొడుతోంది. ముందు ఢిల్లీలో ఆప్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు లేవలేదు. గడచిన పదేళ్ళుగా ఇటు కాంగ్రెస్ ను అటు బీజేపీని ఏకకాలంలో ఆప్ దెబ్బకొడుతునే ఉంది. దీంతో కాంగ్రెస్ సంగతి ఎలాగున్నా బీజేపీ మాత్రం బాగా మండిపోతోంది. అందుకనే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను రాచి రంపాన పెడుతోంది.





ఈ సంగతి వదిలేస్తే ఆప్ తర్వాత టార్గెట్ పంజాబ్ అయ్యింది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో గట్టిదెబ్బే  కొట్టింది. మళ్ళీ అధికారం తమదే అనే భ్రమలో ఉన్న కాంగ్రెస్  ఆప్ కొట్టిన దెబ్బకు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. 117 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ ఏకంగా 95 సీట్లలో అఖండ విజయం సాధించింది. ఇపుడు ఆప్ దృష్టి గుజరాత్ మీద పడింది.





గడచిన పాతికేళ్ళుగా గుజరాత్ లో కాంగ్రెస్ అధికారానికి దూరమైపోయింది. ఎప్పటికప్పుడు ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డ్యామ్ షూర్ గా అధికారంలోకి రావటం ఖాయమని కాంగ్రెస్ అనుకున్నా జస్ట్ మిస్సన్నట్లుగా అయిపోయింది పరిస్దితి. దాంతో ఈ ఏడాది డిసెంబర్లో జరగబోయే ఎన్నికల్లో అధికారం ఖాయమే అని డిసైడ్ అయిపోయింది. ఇంతలో హఠాత్తుగా ఆప్ ఎన్నికల బరిలోకి దూకింది.





గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రతిపక్షం కాంగ్రెస్ కు కూడా ఆప్ చుక్కలు చూపిస్తోంది. పంజాబ్ లో లాగే గుజరాత్ లో కూడా ఆప్ అంటే జనాల్లో బాగా క్రేజ్ పెరిగిపోతున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఆప్ క్లీన్ రికార్డు, పంజాబ్ పాలనలో  పాజిటివ్ దృక్పధం గుజరాత్ ప్రజలపై బాగా పనిచేస్తున్నట్లుంది. దశాబ్దాలుగా బీజేపీ పాలన వల్ల పెరిగిపోతున్న వ్యతిరేకత, కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోవటం తమకు కలిసొస్తోందని ఆప్ నేతలంటున్నారు.  సో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలీదుకానీ కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడమైతే ఖాయమని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: