రాజధాని విషయంలో బీజేపీ నేతలు జనాలకు పిచ్చెక్కిచ్చేస్తున్నట్లున్నారు. తాజాగా కమలంపార్టీ నేతలు ఏకైక రాజధాని అమరావతి అనే నినాదం విషయంలో యూ టర్న్ తీసుకున్నట్లే ఉన్నారు. గురువారం పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మాట్లాడుతు కర్నూలులో హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్రం సహకరిస్తుందన్నారు. కర్నూలులో హై కోర్టు ఏర్పాటన్నది రాష్ట్రప్రభుత్వం చేతుల్లోనే ఉందని చెప్పారు.
ఒకప్పటి ముఖ్యమంత్రులందరు మొత్తం అభివృద్ధిని హైదరాబాద్ లోనే కేంద్రీకృతం చేయటంవల్ల మిగిలిన ప్రాంతమంతా నష్టపోయిందన్నారు. ఇపుడు ఏపీ వెనకబాటుతనం దాని ఫలితమే అన్నారు. ఇలాగ అంటూనే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అన్న వాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడుందని కూడా అన్నారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతుండటం వల్లే జనాలకు పిచ్చెక్కిపోతోంది.
ప్రొద్దుటూరులో రాయలసీమ జోన్ సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. అంటే వీర్రాజు, జీవీఎల్ మాటలు చూస్తుంటే త్వరలోనే కర్నూలుకు హైకోర్టుకు తరలి వెళ్ళటం ఖాయమనే అనిపిస్తోంది. కేంద్రం కూడా రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు ఒక అంగీకారానికి వస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పిన విషయం తెలిసిందే. ఈమధ్యనే కేంద్రం చేసిన ప్రకటన, ఇపుడు బీజేపీ ముఖ్యనేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే కేంద్రం స్ధాయిలో మూడు రాజధానుల ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లే అనిపిస్తోంది.
నిజానికి రాజధాని ఏర్పాటుతో కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదని కేంద్రం ఎప్పుడో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రెండుసార్లు స్పష్టంగా చెప్పేసింది. ఏదేమైనా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తొందరలోనే మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమనే అనిపిస్తోంది. జాతీయస్ధాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల కారణంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లే అనుకోవాలి. ఒకసారి హైకోర్టు తరలింపుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఓకే చెప్పేస్తే మూడు రాజధానుల ఏర్పాటు అయిపోయినట్లే.