దేశంలోని రైతుల పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్‌ పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున చెల్లిస్తోంది.ఇక ఈ మొత్తాన్ని ఈ మూడు విడతలుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అలాగే, రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన మరో పథకమే.. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన రైతులు పెన్షన్‌ పొందొచ్చు. కనీసం రూ.3 వేలు పింఛన్‌గా అందుతుంది. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా నమోదు చేసుకోవాలి? అంటే.. ఇది ముసలి తనంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రతను అందించడానికి రూపొందించిన ప్రభుత్వ పథకం. దీనికి 18-40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2019 ఆగస్టు నాటికి దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డులలో పేర్లు ఉండి.. 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. అలాంటి చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి పేర్లు నమోదు చేసుకోవచ్చు. పెన్షన్ పొందడానికి ఖచ్చితంగా 60 ఏళ్లు నిండాలి.


ఈ పథకం పరిధిలోకి వచ్చిన రైతులకు కనీస హామీ పెన్షన్ నెలకు రూ.3,000. పెన్షన్ పొందే రైతు చనిపోతే అతడి జీవిత భాగస్వామికి 50% పెన్షన్ వస్తుంది.కుటుంబ పెన్షన్‌కు జీవిత భాగస్వామి మాత్రమే అర్హులు.18-40 సంవత్సరాల మధ్య వయసు గల రైతులు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ.55 నుంచి రూ.200 చెల్లించాలి. దరఖాస్తుదారుడైన రైతు తనకు 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ కోసం క్లెయిమ్‌ను సమర్పించాలి. ప్రతి నెలా రైతు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం పెన్షన్ జమ చేస్తుంది.అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఈఎస్ఐ స్కీమ్‌, ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు, ఏవైనా ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల కింద కవరేజీలో ఉన్నవారు, జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు ఈ పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనలో పెన్షన్‌కు అర్హులు కారు.కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పెన్షన్ అప్లై చేసుకోండి. ప్రయోజనాలని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: