తెలంగాణాలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) ఒక్కసారిగా జోరుపెంచింది. అదికూడా టీఆర్ఎస్ లోని కీలక నేతలకు అత్యంత సన్నిహితులని అనుకునే వాళ్ళతో పాటు డైరెక్టుగా కాంగ్రెస్ నేతలమీద కన్నేసింది. ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, షబ్బీర్ ఆలీ, రేణుకా చౌదరి లాంటివాళ్ళకు విచారణకు హాజరుకమ్మని నోటీసులిచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ నేతలను డైరెక్టుగా నోటీసులిస్తునే మరోవైపు అధికారపార్టీ ప్రముఖులకు సన్నిహితులపై దాడులు చేస్తోంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండుపార్టీలకు సంబంధించి ఈడీ చేస్తున్న దాడులు, నోటీసులు వేర్వేరు కేసులమీద. నేషనల్ హెరాల్డ్ ముసుగులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ బలంగా అనుమానిస్తోంది. ఇప్పటికే ఇవే ఆరోపణలపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన విషయం తెలిసిందే. ఇపుడు హైదరాబాద్ లోని సీనియర్ నేతలకు నోటీసులిచ్చి విచారణకు రమ్మని చెప్పింది. ఇదే సమయంలో మరికొందరు ఉన్నతాధికారులు కేసీయార్ కుటుంబానికి బాగా సన్నిహితులుగా ప్రచారంలో ఉన్న వారిపై దాడులు చేస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే తొందరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో ప్రత్యర్ధులను ఇబ్బందుల్లో పెట్టడానికి బీజేపీనే దాడులుచేయిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఒత్తిడి రాజకీయాలు చేయటం కమలంపార్టీకి కొత్తేమీకాదు. చాలా రాష్ట్రాల్లో నాన్ బీజేపీ పార్టీల్లోని ప్రముఖ నేతలపై ఇప్పటికే చాలాసార్లు దాడులుచేయించింది. కొందరిని విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టులు కూడా చేయించింది.
మరి కొందరిపైన అయితే దాదాపు దశాబ్దం క్రితం కేసులను కూడా తవ్వి తీస్తోంది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలుపు అనుమానంగా మారింది. మొదట్లో కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పెద్ద తోపనే అనుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ రాజగోపాల్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాంతో బీజేపీ గెలుపు కష్టమే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రెండుపార్టీల్లోని సీనియర్లు లేదా కీలకవ్యక్తుల జోరుకు ఏదోరకంగా బ్రేకులు వేయగలిగితే కానీ బీజేపీ గెలుపు సాధ్యంకాదని అర్ధమైనట్లుంది. అందుకనే ఈడీ రంగంలోకి దింపారనే ప్రచారం పెరిగిపోతోంది.