కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలాగ తయారైందంటే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నట్లుంది. ఈ పద్దతిలోనే మధ్యప్రదేశ్ లో తన ప్రభుత్వాన్ని తానే కూలదోసేసుకుంది. దాదాపు 15 ఏళ్ళ తర్వాత జనాలు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఓట్లేసి అధికారాన్ని అప్పగించారు. అయితే అధికారంకోసం జరిగిన కుమ్ములాటల్లో వర్గాలుగా విడిపోయిన నేతలు సొంత ప్రభుత్వాన్ని కూల్చేసుకున్నారు. ఇపుడు రాజస్ధాన్లో కూడా దాదాపు అదే సీన్ కనబడుతోంది.





రాజస్ధాన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం వెనుక యువనేత సచిన్ పైలెట్ కష్టం చాలానే ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తానే సీఎం అవుతారని సచిన్ అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ సోనియాగాంధీ దగ్గర చక్రంతిప్పి సీఎం అయిపోయారు. అప్పటినుండి సచిన్ ఇటు అశోక్ తో పాటు అటు సోనియా మీద కూడా మండుతున్నారు. అయితే రాహుల్ గాంధి కారణంగా మౌనంగా ఉంటున్నారు.





ఇపుడు ఇదే అశోక్ ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే అశోక్ మాత్రం అధ్యక్ష పదవితో పాటు రాజస్ధాన్ సీఎంగా కూడా కంటిన్యు అవుతాననే కండీషన్ పెడుతున్నారు. ఎట్టి పరిస్దితుల్లోను తన బద్ద వ్యతిరేకి సచిన్ ను సీఎంను కానివ్వకూడదని పట్టుదలగా ఉన్నారు. సీనియర్లలో కొందరు దీనికి అభ్యంతరం చెబుతున్నా అశోక్ వినటంలేదు. రెండుపదవులు కాదు మూడు పదవులు నిర్వహించే సామర్ధ్యం కూడా తనకుందని వాదిస్తున్నారు.






అయితే రాహుల్ గట్టిగా చెప్పిన తర్వాత అశోక్ కు వేరేదారి లేక ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ బద్ధవిరోధి అయిన సచిన్ కుర్చీలో కూర్చోకుండా స్పీకర్ జోషీని ప్రతిపాదించారట. అశోక్ చెప్పినట్లే జరిగితే సచిన్ తన మద్దతుదారులతో పార్టీనుండి బయటకు వెళ్ళిపోవటం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. చేజేతులా తమ ప్రభుత్వాన్ని తామే కూల్చేసుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. బతికున్నంతకాలం పదవుల్లో తామే ఉండాలని సీనియర్లు అనుకుంటే ఇక యువత పరిస్ధితి ఏమిటి ?



మరింత సమాచారం తెలుసుకోండి: