చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా గట్టిగా ట్విట్టర్లో గర్జించారు. దేనికి గర్జనలు అంటు అధికారపార్టీ లేదా ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా చాలా ప్రశ్నలే సంధించారు. ఏకైక అమరావతి డిమాండుతో జరుగుతున్న  పాదయాత్రకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన ప్రజాగర్జన జరుగుతోంది. అంటే ఈ ప్రజాగర్జన మూడు రాజధానులు+అధికార వికేంద్రీకరణకు మద్దతుగానే జరుగుతోంది.





అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండలాని కేవలం అమరావతి ప్రాంతంలోని కొందరు మాత్రమే గోల చేస్తున్నారు. దీక్షలన్నారు, పాదయాత్రల పేరుతో రచ్చ చేస్తున్నారు. అందుకనే దానికి విరుగుడుగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా గర్జన పేరుతో భారీ బహిరంగసభ జరుగుతోంది. దీన్నే చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళు తట్టుకోలేకపోతున్నారు.  మూడురాజధానులకు వ్యతిరేకంగా డైరెక్టుగా చంద్రబాబు ఎక్కడా నిరసన కార్యక్రమం నిర్వహించలేదు.





చంద్రబాబు వెనకుండి అమరావతిలో కొందరు జనాలను రెచ్చగొడుతున్నారంటు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఇపుడు కూడా చంద్రబాబు కాకుండా పవన్ ట్విట్టర్ వేదికమీద ప్రత్యక్షమయ్యారు. దేనికి గర్జనలంటు పవన్ సంధించిన ప్రశ్నల్లో చాలావరకు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయి.  జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ ఇపుడు ప్రస్తావించిన లోపాలు, తప్పుల్లో ఏ ఒక్కదాన్ని కూడా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబును నిలదీయలేదు. పైగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కొంతమంది జనాలు ఎలా డిమాండ్ చేస్తున్నారో వైజాగ్ కూడా రాజధానిగా ఉండాలని డిమాండ్ చేసే హక్కు ఉత్తరాంధ్ర జనాలకు ఉందని పవన్ మరచిపోయారు.





అసలు మూడురాజధానుల ఏర్పాటైతే రాష్ట్రానికి జరిగే నష్టమేమిటో పవన్ జనాలకు వివరిస్తే బాగుంటుంది. తానెందుకు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని ఇంతవరకు పవన్ వివరించలేదు. ఇదే పవన్ ఒకపుడు తన దృష్టిలో కర్నూలే రాజధాని అని, వైజాగ్ అయితే రాజధానిగా బాగుంటుందని పై ప్రాంతాల్లో పర్యటించినపుడు బహిరంగంగా చెప్పారు. మరి తన కోరికనే ఇపుడు జగన్ అమలు చేస్తానంటే ఎందుకు అడ్డుపడుతున్నారు ?



మరింత సమాచారం తెలుసుకోండి: