ప్రధానపార్టీల అగ్రనేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారంలో మాట్లాడుతు మునుగోడును దత్తత తీసుకునేందుకు పోటీలు పడుతున్నారు. బుధవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్డుషోలో మాట్లాడుతు ఉపఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అదికారంలోకి రాగానే నియోజకవర్గం అభివృద్దికి వేల కోట్లరూపాయలు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చేశారు.
ఇక గురువారం నియోజకవర్గంలో రోడ్డుషో చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్ మాట్లాడుతు ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని గెలిపిస్తే తాను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ప్రయారిటి ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు. ఇక బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అయితే 2018 ఎన్నికల్లోనే నియోజకవర్గాన్ని తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. అయితే మళ్ళీ మొన్న రాజీనామా చేసేంతవరకు అడ్రస్ కూడా లేరు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని రేవంత్ అన్నారంటే అర్ధముంది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలోకి వస్తే దత్తత తీసుకుని డెవలప్ చేస్తానని ప్రకటించారు. మరి కేటీయార్ కూడా ఇదే హామీ ఇస్తే ఎలాగ ? కేటీయార్ ఆల్రెడీ అధికారంలోనే ఉన్నారు. నియోజకవర్గంలో గెలిచింది ఎవరనేది చూడకుండా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే తన బాద్యతలో ప్రభుత్వం నూరుశాతం ఫెయిలైంది. 2018లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచిన దగ్గరనుండి ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
రోడ్లు, మంచినీటి సరఫరా, ఆరోగ్యకేంద్రం, డ్రైనేజీ కోసం జనాలు ఎంత గోలపెట్టినా కేసీయార్ పట్టించుకోలేదు. ప్రతిపక్ష ఎంఎల్ఏ గెలిచిన నియోజకవర్గమని అభివృద్ధిలో ఇంతటి వివక్ష చూపిస్తున్న కేసీయార్ ప్రభుత్వం ఇపుడు టీఆర్ఎస్ ను గెలిపిస్తే దత్తత తీసుకుని డెవలప్ చేస్తానని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. అంటే టీఆర్ఎస్ ఓడిపోతే మళ్ళీ ప్రభుత్వం ఇటువైపు చూడదని అర్ధమైపోయింది. అభివృద్ధిలో ఇంతటి వివక్ష చూపిస్తున్న కేసీయార్ బీఆర్ఎస్ పెట్టి దేశాన్ని ఉద్ధిరించేస్తానని బయలుదేరారు.