తెలంగాణాలో తాజా పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పోటీపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేసమయంలో తెలుగుదేశంపార్టీకి కూడా పోటీ చేయబోతోందని ఒకసారి లేదు లేదు చేయటం లేదని మరోసారి ప్రచారం జరిగింది. చివరకు ఏమిజరిగిందంటే టీడీపీ పోటీచేయటంలేదని తేలిపోయింది. ఇక జనసేన అయితే ఎప్పుడో తేల్చేసింది పోటీలో లేనని.





తెలంగాణాలో గడచిన మూడున్నరేళ్ళల్లో ఏ ఉపఎన్నిక వచ్చినా ఈ రెండుపార్టీలు దూరంగానే ఉంటున్నాయి. ఈ ఇద్దరికీ సమస్య ఏమిటంటే నరేంద్రమోడీ, కేసీయార్ ను ఫేస్ చేయటం ఎలాగన్నదే. ఉపఎన్నికల్లో పోటీచేయటం పెద్ద సమస్యకాదు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు కమలంపార్టీని టార్గెట్ చేయలేరు. ఇదే సమయంలో కేసీయార్ గురించి మాట్లాడితే ఏమవుతుందో అని భయం. దాదాపు పవన్ కల్యాణ్ ది కూడా దాదాపు ఇలాంటి సమస్యే.  





పీసీసీ అధ్యక్షుడిగా తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఉన్నపుడు చంద్రబాబు కాంగ్రెస్ ను కూడా ఏమీ అనలేని స్ధితిలో ఉన్నారు. కాంగ్రెస్ మీద ఆరోపణలు, విమర్శలు చేయటానికి పవన్ కు ఏమీ లేదు. సో ఈ స్ధితిలో ఎవరినీ ఏమీ అనలేక ఇక ఎన్నికల్లో పోటీచేస్తే ఏమని ప్రచారం చేయాలి వీళ్ళిద్దరు ? ఈ కారణంగానే దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కూడా అడ్రస్ లేరు.





ఎన్నికల్లో పోటీచేయలేక, ప్రత్యర్ధుల్లో ఎవరినీ ఏమి అనలేక ఇక చంద్రబాబు, పవన్ ఎలాంటి రాజకీయం చేస్తారు ? అందుకనే వీళ్ళిద్దరు జెండాలు పీకేసినట్లే అనే ప్రచారం మొదలైపోయింది. ఉపఎన్నికల్లో  ఎదురైన పరిస్ధితే వీళ్ళద్దరికీ రేపటి జనరల్ ఎన్నికల్లో కూడా ఎదురవుతుంది. ఇపుడే ఏమీ అనలేని వీళ్ళు రేపటి ఎన్నికల్లో అసలు నోరిప్పగలరా ? అందుకనే తెలంగాణాలో రెండుపార్టీల జెండాలు ఎత్తిపోయినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది. విచిత్రం ఏమిటంటే నేతలేమో పోటీచేయాల్సిందే అని ప్రతి ఉపఎన్నికలోను చెబుతుంటే వద్దు వద్దంటు అధినేతలు వెనక్కు లాగుతుండటం.

మరింత సమాచారం తెలుసుకోండి: