జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ సక్సెస్ అయినట్లే ఉంది. అధికార వికేంద్రీకరణ, మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరుతో భారీ ర్యాలీ, బ్రహ్మాండమైన సభ జరిగింది. ర్యాలీ, బహిరంగసభ సూపర్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవైపు జోరున వాన పడుతున్నా జనాలు లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొనటమే కాకుండా తర్వాత బహిరంగసభకు కూడా అటెండ్ అయ్యారు.
ఒకవైపు ప్రజాగర్జన జరుగుతుండగానే జనసేన అధినేత పవన్ జనవాణి కార్యక్రమం పెట్టుకున్నారు. శనివారం నుండి మూడురోజులు పవన్ వైజాగ్ లోనే ఉండబోతున్నారు. ఇదే సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో అమరావతికి, పాదయాత్రకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అంటే ఒకే అంశంపై నాన్ పొలిటికల్ జేఏసీ+ వైసీపీ ఒకవైపు టీడీపీ, పవన్ మరోవైపు నిలబడ్డారు. వైసీపీ మూడురాజధానులు అంటుంటే చంద్రబాబునాయుడు, పవన్ అమరావతి మాత్రమే రాజధాని అనే డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
మూడుపార్టీలు కలిసి వైజాగ్ లోనే ఒకేసమయంలో కలిస్తే కచ్చితంగా గొడవలవుతాయని అందరికీ తెలిసిందే. అయితే ప్రజాగర్జన మధ్యాహ్నానికి అయిపోయింది. సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకోవటానికి మంత్రులు, కీలక నేతలంతా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ను రిసీవ్ చేసుకోవటానికి జనసేన నేతలు, శ్రేణులు పెద్దఎత్తున విమానాశ్రయానికి వచ్చారు.
ఇంతలో ఏమైందో ఏమో మంత్రులు రోజా, జోగిరమేష్, టీటీడీ ఛైర్మన్ వైసీ సుబ్బారెడ్డి ప్రయాణిస్తున్న కార్లపైకి జనసైనికులు దాడిచేశారు. రాళ్ళు, చెప్పులు, కర్రలతో దాడిచేసి అద్దాలను ధ్వంసంచేసేశారు. వెంటనే అలర్టయిన వైసీపీ కార్యకర్తలు కూడా జనసైనికులపై తిరగబడ్డారు. దాంతో రెండువైపులా దాడులు జరిగాయి. దాంతో పరిస్ధితి ఒక్కసారిగా ఉద్రిక్తమైపోయింది. ఇలాంటిగొడవ జరిగేఅవకాశముందని పవన్ గ్రహించుండాలి. లేదా గ్రహించి కూడా కావాలనే సరిగ్గా ఇదేరోజు తన కార్యక్రమం పెట్టుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తంమీద మంత్రుల కార్లపై జనసైనికుల దాడితో ఎయిర్ పోర్టులో ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోయింది.