చరిత్రనుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమీ పాఠాలు నేర్చుకోలేదని అర్ధమవుతోంది. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతు రాజధానిపై తమ స్టాండ్ చాలా క్లారిటిగా ఉందన్నారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలన్నది తమ లైనుగా చెప్పారు. ఇదే పవన్ ఒకపుడు అమరావతిని తప్పుపడుతు చాలానే మాట్లాడారు. కర్నూలుకు ఏదో కార్యక్రమంపై వెళ్ళినపుడు మాట్లాడుతు చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినా తనవరకు కర్నూలే రాజధానని అని ప్రకటించారు.





తర్వాత ఇంకేదో కార్యక్రమంలో వైజాగ్ వెళ్ళినపుడు మాట్లాడుతు తాను విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.  ఆ దశలన్నీ దాటిపోయిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో వెంటనే స్టాండ్ మార్చేసుకున్నారు. అప్పటివరకు కర్నూలు, వైజాగ్ అంటు మాట్లాడిన విషయాన్ని మరచిపోయారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల తర్వాత జగన్ మూడురాజధానులను ప్రతిపాదించారు.





అంటే తాను చెప్పిన కర్నూలు, వైజాగ్ నే జగన్ రాజధానులుగా ప్రకటించటించినా పవన్ తట్టుకోలేకపోతున్నారు.  ఇంతకుముందు సమైక్య రాష్ట్రంలో పాలకులు చేసిన తప్పే ఇపుడు కూడా జరగాలని పవన్ కోరుకుంటున్నారా ? అన్నది అర్ధం కావటంలేదు. అప్పట్లో మిగిలిన రాష్ట్రాన్నంతా ఎండగట్టి అభివృద్ధిలో 90 శాతాన్ని హైదరాబాద్, దీని చుట్టుపక్కలే చేశారు. రాష్ట్ర విభజన ఫలితంపై దాని ప్రభావం చాలా ఎక్కువగా పడింది. అంత జరిగిన తర్వాత కూడా 2014లో సీఎం అయిన చంద్రబాబు మళ్ళీ హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పునే కంటిన్యుచేయాలని అనుకున్నారు.





చంద్రబాబు దురదృష్టమో లేకపోతే జనాల అదృష్టమో తెలీదు కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత సీఎం అయిన జగన్ మూడురాజధానుల కాన్సెప్టు మొదలుపెట్టారు. చంద్రబాబు చేసిన తప్పే జగన్ హయాంలో కూడా జరగాలని పవన్ పట్టుబడుతున్నారు. అంటే చంద్రబాబే కాదు పవన్ కూడా చరిత్రనుండి పాఠాలను నేర్చుకోలేదని అర్ధమవుతోంది. వివిధ రంగాల్లోని నిపుణులంతా అభివృద్ధిని, అధికారాన్ని ఒకేచోట కేంద్రీకరించకూడదని మొత్తుకుంటున్నారు. జగన్ అదే సూచనను పాటిస్తుంటే చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: