విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చంద్రబాబునాయుడు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత తనకు వేరే దారిలేదని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అనిపించుంటుంది. ఇందుకనే తొందరలో తాను వైజాగ్ లో రెగ్యులర్ గా క్యాంపు వేస్తానని పార్టీ నేతలతో చెప్పారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతు తొందరలోనే తాను వైజాగ్ వచ్చి క్యాంపు వేస్తానని చెప్పారు.
విశాఖలో క్యాంపు వేయటమంటే అక్కడే ఒక ఇంటిని తీసుకుని ఉండటమనే నేతలు అర్దం చేసుకుంటున్నారు. కృష్ణానది కరకట్టమీద ఇంటినే ఇపుడు క్యాంపాఫీసుగా వాడుకుంటున్నారు. అమరావతిలో లేకపోతే హైదరాబాద్ సొంతింట్లో ఉంటున్నారు. ఇవి రెండు కాకుండా ఇంకెక్కడికి టూర్ వెళ్ళినా వెంటనే అమరావతికో లేదా హైదరాబాద్ కో చేరుకుంటున్నారు. అలాంటిది ప్రత్యేకించి వైజాగ్ లో ఉంటానని చెప్పారంటేనే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవ్వటం తథ్యమని చంద్రబాబు ఫిక్సయినట్లున్నారు.
తొందరలోనే జగన్మోహన్ రెడ్డి క్యాంపాఫీసు విశాఖలో రెడీ అవుతోందనే ప్రచారం తెలిసిందే. ఏదోరోజు జగన్ విశాఖ వెళిపోవటం ఖాయమని అందరు అనుకుంటున్నదే. జగన్ గనుక అమరావతి నుండి క్యాంపు ఆఫీసును వైజాగ్ కు షిఫ్ట్ చేసేస్తే చంద్రబాబుకే కాదు ప్రతిపక్షాల్లో దేనికీ విజయవాడ లేదా అమరావతి ప్రాంతంలో పెద్దగా పనుండదు. రాజధాని ప్రాంతంలోనే ముఖ్యమంత్రయినా ప్రతిపక్ష నేతలైనా కూర్చుంటారు. అలాంటిది జగన్ విశాఖకు వెళిపోతే మంత్రుల కార్యాలయాలు, ముఖ్యమైన అధికార యంత్రాంగమంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతిపక్షాల నేతలు అమరావతిలోనే కూర్చుని చేసేదేమీ ఉండదు.
అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడా వినబడటంలేదు. ఇదే సమయంలో కర్నూలుకు హైకోర్టు తరలించాలని రాయలసీమ ప్రాంతంలో డిమాండ్లు పెరుగుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పాలన మొదలుపెట్టాలని ఉత్తరాంధ్రలో డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. జగన్ ప్రతిపాదనకు కేంద్రం అభ్యంతరాలు చెప్పలేదు. హైకోర్టు తరలింపుకు జ్యుడీషియరీ ఆమోదం దొరికితే చాలు వెంటనే మూడు రాజధానులు అయిపోయినట్లే. ఇవన్నీ గమనించిన కారణంగానే చంద్రబాబు తొందరలో వైజాగ్ లో క్యాంపు వేయాలని అనుకున్నట్లున్నారు.