ఇటీవల కాలంలో అల్పపీడనం వల్ల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎపి,తెలంగాణాలో ఇప్పుడు మరోసారి భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ, అది ఎక్కడ తీరం దాటుతుంది.. తీవ్రత ఎంత ఉంటుంది అన్న విషయాలపై స్పష్టత రాలేదు.రాబోయే 24 గంటల్లో ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 22న ఉదయం… మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. 



తుఫాన్‌గా మారితే.. ఆంధ్రా, ఒడిశా సమీపంలో తీరం దాటితే తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి సిత్రాంగ్ అనే పేరు పెట్టనున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సముద్ర తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది..విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తుపాను ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.



కాగా ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తువరకు విస్తరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. రాయలసీమను అయితే వరదులు ముంచెత్తాయి. ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఈ లోపే మరో తుఫాన్ హెచ్చరిక ప్రజలను భయపెడుతుంది. మరోవైపు మంగళవారం విజయవాడలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కొయ్యూరు మండలం కాకరపాడులో 5.6, తాడేపల్లిగూడెంలో 5.6, , విజయవాడలో 5.1, కంభం మండలం రావిపాడులో 5, రాజమహేంద్రవరంలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఆంధ్రప్రదేశ్ అంతటా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు..ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: