జనసేన నేతలు లేదా కాపుల్లో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఉన్న కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పవన్ ఇంటిముందు రెక్కీ జరిగిందనే విషయమై చంద్రబాబునాయుడు, నాదెండ్ల మనోహర్, సోమువీర్రాజుతో పాటు చాలామంది జనసేన నేతలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. రెక్కీ జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలీదు. ఒకవేళ జరిగినా అది జరిగింది హైదరాబాద్ లోని పవన్ ఇంటిముందు. హైదరాబాద్ లో పవన్ ఇంటిముందు రెక్కీ జరిగితే పవన్ను చంపటానికే జగన్ ప్లాన్ చేస్తున్నాడంటు గోల గోల చేసేస్తున్నారు.
ఈ మొత్తంలో విచిత్రం ఏమింటటే అప్పట్లో వంగవీటి రంగా హత్య జరిగినట్లుగానే ఇపుడు పవన్ను కూడా హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటు కొందరు కాపునేతలు ఆరోపణలు చేయటం. అసలు రంగాకు పవన్ కు ఏమిటి పోలికేమిటో అర్ధంకావటంలేదు. ఇద్దరిమధ్య కామన్ పాయింట్ ఏమిటంటే కాపులు అవటం మాత్రమే. రంగా ఫుల్ టైం పొలిటీషియన్. అవటానికి రంగా కాపు అయినప్పటికీ ఆయన కాపులకు మాత్రమే ప్రతినిధిగానో లేకపోతే నేతగానో పరిమితం కాలేదు. కష్టాల్లో ఉన్నామని ఎవరొచ్చినా రంగా ఆదుకునేవారు.
అందుకనే కులాలకు అతీతంగా మధ్య, పేద తరగతి ప్రజల్లో రంగాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక పవన్ విషయం తీసుకుంటే సినిమా అభిమానుల్లో తప్ప ఇంకెవరు పవన్ను పట్టించుకోరు. కాపుల్లోనే మెజారిటి సెక్షన్ పవన్ కు దూరం. సినిమా అభిమానుల్లో కూడా ‘పవన్ కోసం ప్రాణమిస్తాం కానీ ఓట్లుమాత్రం జగన్ కు వేస్తాం’ అనే అంటారు. పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోవటమే దీనికి ఆధారం. పైగా తన సభలకు వచ్చి సీఎంసీఎం అని అరుస్తు ఓట్లుమాత్రం వైసీపీకి వేయటం ఏమిటంటు పవనే బహిరంగంగా మండిపోడిన విషయం తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే జనసేన లేదా కాపుల్లో పవన్ మద్దతుదారులు రంగా-పవన్ సమానస్ధాయి నేతలే అని మిగిలిన జనాల్లో భావన కలిగేట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులకు పవన్ ఒక్కడే దిక్కన్నట్లుగా ప్రొజెక్టు చేస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.