చంద్రబాబునాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీని నాయకత్వ సమస్య పీడిస్తున్నది వాస్తవం. చెప్పుకోవటానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ ఆయన వ్యూహాలేవీ పనిచేయటంలేదు. గట్టిగా చెప్పాలంటే పార్టీ నేతల్లో చాలామంది చంద్రబాబు ఆదేశాలను పెద్దగా పట్టించుకోవటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా చాలామంది  నేతలు స్పందించటంలేదు. ఈ విషయాన్ని ఎవరో చెప్పటంకాదు నేతల సమావేశంలో స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని చెప్పారు.





ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలుపిస్తే చాలామంది నేతలు బయటకు రాకుండా హాయిగా ఇంట్లోనే పడుకుంటున్నారంటు మండిపోయారు. దీన్నిబట్టే చంద్రబాబు మాటకు నేతలు విలువివ్వటంలేదని అర్ధమైపోతోంది. ఇక చంద్రబాబు తర్వాత పార్టీపగ్గాలు అందుకోబోతున్న లోకేష్ పరిస్ధితి అయితే మరీ అన్యాయం. చంద్రబాబు నాయకత్వం మీదే నమ్మకం లేదంటే ఇక లోకేష్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వారసత్వ హోదాలో లోకేష్ పగ్గాలు అందుకోవచ్చేమో కానీ ప్రతిభ ఆధారంగా మాత్రం కాదనే ప్రచారం అందరికీ తెలిసిందే.





పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిన నేతలంతా చంద్రబాబుకు రాసిన లేఖలో లోకేష్ వల్లే పార్టీ నాశనమైపోతోందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడే పార్టీలో నాయకత్వ సమస్య స్పష్టంగా బయటపడింది. చంద్రబాబు తర్వాత పార్టీని లీడ్ చేసేది ఎవరు అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకటంలేదు. తనను ఎవరు సవాలు చేయకుండా ఉండటం కోసమే పార్టీలో ఎవరినీ చంద్రబాబు ఎవరినీ ఎదగనీయలేదు.





అచ్చెన్నాయుడు లాంటి దూకుడు నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినా అదిపేరుకు మాత్రమే అని అందరికీ తెలుసు. రాష్ట్ర అధ్యక్షుడని చెప్పుకోవటానికి తప్ప ఆ పదవి అచ్చెన్నకు ఇంకదేనికీ పనికిరావటంలేదు. కింజరాపు రామ్మోహన్ నాయుడు లాంటి గట్టి యువనేత ఉన్నా ఉపయోగం కనబడటంలేదు. తనకు పోటీ రానీకూడదని, లోకేష్ నాయకత్వాన్ని సవాలు చేయకూడదనే ఆలోచనలతోనే ద్వితీయస్ధాయి నాయకత్వం లేకుండా చేసిన తప్పుమాత్రం చంద్రబాబుదే. తన తప్పుకు పార్టీ పెనాల్టీ చెల్లించాల్సొస్తోందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: