అమరావతి ప్రాంతం అంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలివ్వటాన్ని అమరావతి ప్రాంతంలోని వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పేదలకు పట్టాలు ఎలాగిస్తారంటు ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. ఇదే విషయమై సోమవారం సీఆర్డీయే ఉన్నతాధికారులతో అమరావతిప్రాంతవాసులు పెద్ద గొడవేసుకున్నారు. తమపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నా వీళ్ళు మాత్రం లెక్కచేయటంలేదు.
అసలు అమరావతి ప్రాంతీయులపై మిగిలిన ప్రాంతాల్లోని జనాల్లో ఇందుకే వ్యతిరేకత పెరిగిపోతోంది. మిగిలిన రాష్ట్రం ఎలాపోయినా పర్వాలేదు తమప్రాంతం మాత్రం బాగుపడితే చాలన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అమరావతి జేఏసీ చేసిన పాదయాత్రపై మిగిలిన ప్రాంతాల్లో ఎంత వ్యతిరేకత పెరిగిపోతోందో అందరు చూస్తున్నదే. తమ వైఖరివల్లే మిగిలిన ప్రాంతాల్లో అశాంతి పెరిగిపోతున్నా వీళ్ళు మాత్రం లెక్కచేయటంలేదు.
దీనికి ప్రధానకారణం చంద్రబాబునాయుడనే చెప్పాలి. సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్ళస్ధలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటే అడ్డుకున్నారు. తాము భూములిచ్చింది రాజధాని నిర్మాణానికే కానీ పేదలకు పట్టాలివ్వటం కోసం కాదన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు పట్టాలివ్వటం తమకిష్టంలేదని కోర్టులో కేసువేశారు. ఆ దశలన్నీ దాటిపోయి ప్రభుత్వం సీఆర్డీయే చట్టాన్ని సవరించుకున్నది. సవరించిన చట్టంప్రకారం పేదలకు ఇళ్ళపట్టాలు ఇస్తుంటే ఇపుడు మళ్ళీ అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఆర్డీయే చట్టంలో సవరణలపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
తమ ప్రాంతంలో పేదలు ఉండకూడదన్నట్లుందని గట్టిగానే చెబుతున్నారు. పేదలుండకూడదని ఒకవైపు వీళ్ళు చెబుతుంటే మరోవైపు చంద్రబాబు మాత్రం అమరావతిని ప్రజారాజధానిగా చెప్పటమే విచిత్రంగా ఉంది. ఒకసారి తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత ఆ భూములపై వీళ్ళకు హక్కులుండవు. అయినా సరే ఇపుడు కూడా ఆ భూములు తమ సొంతమన్నట్లుగానే ఉన్నతాధికారులతో గొడవలు పడుతున్నారు. పేదలకు ఇళ్ళపట్టాలిస్తే డెమొక్రటిక్ ఇంబ్యాలెన్స్ పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్న కారణంగానే అమరావతి ప్రాంతీయులంటేనే మిగిలిన ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది.