ఇపుడున్న కార్యక్రమాలు సరిపోవన్నట్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా ‘జగనన్న ఇళ్ళ-లబ్దిదారుల కన్నీళ్ళు’ అనే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే జగనన్న కాలనీల్లో నిర్మాణాల్లో ఉన్న లబ్దిదారుల దగ్గరకు వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాలు, వాళ్ళకు ఎదురవుతున్న వేధింపులను సమాజం దృష్టికి తీసుకురావటమే. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురదచల్లేయటమే లక్ష్యం.






ప్రతిపక్షమన్నాక ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపాల్సిందే అనటంలో సందేహంలేదు. అయితే లేని సమస్యలను ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు జనాలను ఒత్తిడి తేవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. మూడురోజుల క్రితం పెడన, మరుసటిరోజు మంగళగిరి, నిన్న విజయనగరంలోని గుంకలాంలో జరిగిన గొడవలే దీనికి ఉదాహరణ. పై మూడు ప్రాంతాల్లోని జరిగిన గొడవలు చూస్తుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయటమే పవన్ ఉద్దేశ్యమా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.






పెడన, మంగళగిరి, గుంకలాంలో జనసేన నేతలు జగనన్న కాలనీల్లో లబ్దిదారులదగ్గరకు వెళ్ళి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను చెప్పాలని ఒత్తిడిపెట్టారు. వాళ్ళు ఎదురుతిరిగటంతో పెద్ద గొడవలయ్యాయి. మూడుచోట్ల కూడా లబ్దిదారులకు, నేతలకు మధ్య తోపులాటలు జరిగి కొట్టుకునే వరకు పరిస్ధితి దిగజారింది. ఇక్కడ పవన్ మరచిపోయిన లాజిక్ ఒకటుంది. సమస్యలు ఏమైనా ఉంటే జనాలే వచ్చి చెప్పుకుంటారు కానీ నేతలు వెళ్ళి బలవంతం పెడితే సమస్యలు చెప్పుకుంటారా ? గుడెసెలలో ఉండే తమకు ఇంటిస్ధలమిచ్చి, ఇళ్ళు కట్టిస్తున్న జగన్ గురించి తాము ఎందుకు తప్పుగా చెప్పాలంటు ఎదురు తిరుగుతున్నారు.





ఇక్కడ పవన్ మరచిపోయిన విషయం ఏమిటంటే ఒకవేళ లబ్దిదారులు తాము పడుతున్న ఇబ్బందులను చెప్పారనే అనుకుందాం. అప్పుడేమవుతుంది ? జగన్ కు వ్యతిరేకంగా లబ్దిదారులు చేసిన ఆరోపణలు, లేదా తాము పడుతున్న బాధల వీడియోలను పార్టీ సోషల్ మీడియా లో అప్ లోడ్ చేస్తారు. వెంటనే అది ప్రభుత్వం దృష్టికి వెళుతుంది. లబ్దిదారుడికి ఇంటిస్ధలం, ఇల్లు రద్దవుతుంది. అప్పుడు లబ్దిదారుడికి పవన్ ఏ విధంగా సాయం చేసినట్లు ? పవన్  పుణ్యమాని లబ్దిదారులకు ఇంటిస్ధలంతో పాటు ఇల్లుకూడా పోతుంది. అందుకనే నిజంగానే సమస్యలు లేవో ఒకవేళ ఉన్నా భయంతోనే లబ్దిదారులు మాట్లాడటంలేదన్నది అర్ధమవుతోంది.  పవన్ కే ఈ విషయం అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: