అసెంబ్లీలో ఏమో భీకర ప్రతిజ్ఞచేశారు. కర్నూల్లో ఏమో జనాలను బ్బాబ్బాబు బ్బాబ్బాబు అంటు బతిమలాడుకుంటున్నారు. మొత్తానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. తానుచేసిన ప్రతిజ్ఞ నెరవేర్చే బాధ్యత మీమీదే ఉందంటు ఇపుడు జనాలనెత్తిన తోసేస్తున్నారు. చంద్రబాబు మాటలు ఎలాగున్నాయంటే తాను ప్రతిజ్ఞ చేసేశాను కాబట్టి దాన్ని జనాలంతా కలిసి నెరవేర్చాల్సిందే అన్నట్లుగా ఉంది.





ఇంతకీ విషయం ఏమిటంటే మూడురోజుల కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కోడుమూరు, పత్తికొండలో జరిగిన రోడ్డుషోలో మాట్లాడుతు రాబోయేవే తనకు చివరి ఎన్నికలు కాబట్టి ఎలాగైనా టీడీపీని గెలిపించి తనను అసెంబ్లీకి పంపాలని బతిమలాడుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే తాను అసెంబ్లీలోకి  అడుగుపెడతానని చేసిన ప్రతిజ్ఞ నెరవేరాలంటే అది జనాల చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలనే సెంటిమెంటును కూడా ప్రయోగించారు.





2024 ఎన్నికల తర్వాత ఇక చంద్రబాబు పోటీచేయరా ?    అంటే చెప్పేందుకు లేదు. ఎందుకంటే అవసరానికి ఎంతటి అబద్ధమైనా చెప్పటం చంద్రబాబుకు బాగా అలవాటన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆపై ఎన్నికల్లో కూడా పోటీకి రెడీ అని అన్నా అంటారు. కాకపోతే 2024 ఎన్నికలకు చంద్రబాబు వయసు సుమారు 75 ఉంటుంది. వయసు రీత్యా చివరి ఎన్నికలు అయితే కావచ్చేమో కానీ కోరికరీత్యా మాత్రం కాదు.





అయినా చంద్రబాబు ప్రతిజ్ఞను నెరవేర్చాల్సిన బాధ్యత జనాలపైన ఎలాగుందో అర్ధంకావటంలేదు. సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెడతానన్న ప్రతిజ్ఞను చంద్రబాబు ఎవరినడిగి చేశారు ? తనతో పాటు తన భార్యను తీవ్రంగా అవమానించారనే విషయాన్ని చంద్రబాబు ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు అందుకు తగ్గట్లుగా పోరాటాలు చేయాలి కానీ బతిమలాడుకోవటం ఏమిటో ? తన భార్యను అసెంబ్లీలో అవమానించారనే సెంటిమెంటును ప్రయోగించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నట్లున్నారు. మరి చంద్రబాబు సెంటిమెంటు ఫలిస్తుందా ? జనాలు గెలిపిస్తారా ? చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెడతారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: