‘వచ్చే ఎన్నికల్లో మనం గెలిస్తే తర్వాత వచ్చే 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాము’..ఇవి తాజాగా జగన్మోహన్ రెడ్డి అన్నమాటలు. విశాఖపట్నం నగరంలోని ఉత్తరం నియోజకవర్గం కార్యకర్తల భేటీలో జగన్ మాట్లాడుతు 30 ఏళ్ళపాటు వైసీపీనే అధికారంలో ఉండాలని గట్టిగా చెప్పారు. నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తే అదిపెద్ద విషయం కూడా కాదన్నారు. పార్టీ అధికారంలో కంటిన్యు అవటానికి అందరి భాగస్వామ్యం చాలా అవసరమని నొక్కిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ వైసీపీనే గెలవాలంటు పాత రికార్డునే వినిపించారు.
30 ఏళ్ళు మనమే అధికారంలో ఉండాలనే మాట ఏపీ జనాలు వినటం కొత్తేమీకాదు. ఎందుకంటే గతంలో చంద్రబాబునాయుడు కూడా పదేపదే ఇలాగే చెప్పేవారు. బహిరంగసభలైనా, పార్టీ నేతల సమీక్షలైనా రాబోయే 30 సంవత్సరాలు టీడీపీనే అధికారంలో ఉండాలంటు చంద్రబాబు చాలాసార్లుచెప్పారు. నిజంగానే పార్టీ అన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటుందనే భ్రమతోనే భ్ర(అ)మరావతి ప్రాజెక్టును టేకప్ చేశారు. కానీ చివరకు ఏమైంది జనాలు 2019 ఎన్నికల్లో లాగిపెట్టి కొడితే 23 సీట్లకు పరిమితమైపోయారు.
సీన్ కట్ చేస్తే ఇపుడు జగన్ కూడా అదేబాటలో నడుస్తున్నారు. ఎవరితో మాట్లాడినా 30 ఏళ్ళు వైసీపీనే అధికారంలో ఉండాలంటు పాటపాడుతున్నారు. 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని చంద్రబాబో లేకపోతే జగన్ అనుకోవటంకాదు. ఆ మాట జనాలు అనుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకపుడు పశ్చిమబెంగాల్లో జ్యోతిబసు, ఇపుడు ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ రెండుదశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్నారు. కారణం ఏమిటంటే జనాలు మెచ్చిన వాళ్ళ పరిపాలనే.
వాళ్ళ పాలనను జనాలు మెచ్చారు+వాళ్ళ ఎలక్షనీరింగ్ కెపాసిటి కారణంగా అది సాధ్యమైంది. సంక్షేమపథకాలు అందిస్తే చాలు జనాలు తమకు ఓట్లేసేస్తారని జగన్ అనుకుంటున్నట్లున్నారు. జగన్ పాలనలో రోడ్లు అస్తవ్యస్ధంగా ఉన్నాయన్నది వాస్తవం. జనాలందరికీ అవసరమైన మౌళికసదుపాయాల కల్పనలో తన ప్రభుత్వం ఫైయిలైందన్న వాస్తవాన్ని జగన్ గ్రహించారో లేదో తెలీదు. ఈ విషయంలో జనాల్లో బాగా వ్యతిరేకతుంది. కాబట్టి ఇలాంటి విషయాలపై జగన్ శ్రద్ధపెట్టి జనాలను మెప్పిస్తేనే తన కోరిక తీరే అవకాశముంది. లేకపోతే చంద్రబాబు బాటలోనే నడవక తప్పదు.