జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న ఒకటి సంధించారు. తాను ఊపిరి తీసుకోవటం ఆపేయాలా అంటు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మొదటి తన సినిమాల రిలీజ్ ను ఆపేశారని మండిపడ్డారు. తర్వాత విశాఖపట్నంలో తన వాహనంలో నుండి బయటకు రావటంపై అభ్యంతరం వ్యక్తంచేశారన్నారు. తర్వాత హోటల్లో నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తర్వాత తనను నిర్బంధంగా వైజాగ్ సిటీ నుండి పంపేశారన్నారు.
ఆ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి ఇప్పటం గ్రామానికి వెళ్ళాలంటే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఇపుడు తాను యాత్రకోసం తయారుచేయించుకున్న వారాహి వాహనం కలర్ పైన కూడా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారంటు గోల మొదలుపెట్టారు. తాను ప్రయాణంచేయబోయే వాహనం రంగును కూడా ప్రభుత్వం ఎందుకు ఇష్యూ చేస్తోందో అర్ధం కావటంలేదన్నారు. చివరకు తాను ఊపిరి కూడా తీసుకోవటం కూడా ఆపేయాలా ? అంటు మండిపడ్డారు.
ఇదే ట్విట్టర్ వేదికలో ఒక ఆలీవ్ రంగు మిలిట్రీ యూనిఫారమ్ లాంటి చొక్కాను చూపించి దీన్ని వేసుకోవటానికైనా తనను వైసీపీ అలౌ చేస్తుందా ? అంటు ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని, వైసీపీని ఉద్దేశించి పవన్ సంధించిన ప్రశ్నలు బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ సినిమాల రిలీజును ప్రభుత్వం అడ్డుకోలేదు. అలాగే పవన్ విశాఖపట్నంలో వాహనంలో తిరగటానికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ముందుగా పర్మీషన్ తీసుకోవాలని మాత్రమే చెప్పింది.
తనకు పర్మీషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని పవన్ చెప్పటంతోనే అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎందుకంటే పవన్ రాజకీయపార్టీ అధినేత మాత్రమే కాదు అంతకుముందు సినీ సెలబ్రిటీ కూడా. పవన్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండానే ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసిందంతే. ఇదే నిబంధన పవన్ బసచేసిన హోటల్లో కూడా వర్తిస్తుంది. ఎందుకంటే అంతకుముందే విశాఖ విమానాశ్రయంలో మంత్రుల కార్లపైన జనసేన శ్రేణులు దాడులు చేయబట్టే ఈ గోలంతా జరిగిందన్న విషయాన్ని పవన్ కన్వీనియంట్ గా మరచిపోయారు. ఇక వాహనంకు వేసిన రంగును రవాణాశాఖ ద్వారా క్లారిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే తన వాహనానికి పసుపు రంగు వేసుకోమని పేర్నినాని ఎద్దేవా చేయటాన్నే పవన్ తట్టుకోలేకపోతున్నట్లున్నారు.