వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారనే భయంతో ఎల్లోమీడియాలో వణకు మొదలైనట్లుంది. ఎలాగైనా వైసీపీ ఓడిపోవాలని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎల్లోమీడియా టీడీపీ కన్నా ఎక్కువగా కష్టపడుతున్న విషయం అందరు చూస్తున్నదే. ఇందులో భాగంగానే ‘వాలంటీర్లు కాదు...వైకాపా వేగులు’ అంటు పెద్ద బ్యానర్ కథనాన్ని అచ్చేసింది. ఆ కథనం చదివితే అందరికీ అర్ధమయ్యేదేమంటే 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అవుతారని ఎల్లోమీడియా భయపడుతోందని.
ఇంతకీ ఆ కథనంలో ఏముందంటే వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేసి వాళ్ళద్వారా జగన్ జనాలపై నిరంతర నిఘా పెడుతున్నారట. వాళ్ళంతా వాలంటీర్లు లాగ కాకుండా జగన్ కోసం గూఢచారి పనిచేస్తున్నారట. ప్రజల కదలికల్ని నిరంతరం గమనిస్తున్నారట. ప్రజలసొమ్మును జీతాలుగా తీసుకుంటు జగన్ కోసం పనిచేస్తున్నారట. ఈ వ్యవస్ధ ప్రజాస్వామ్యానికే పెనుసవాలుగా మారిపోయిందట. ఈ వ్యవస్ధ వల్ల సమాజానికి హాని కలుగుతోందట. నిజానికి వాలంటీర్ వ్యవస్ధతో జనాలు చాలామంది హ్యాపీగా ఉన్నారు.
పింఛన్లు, ప్రభుత్వ పథకాలు అందరికీ సక్రమంగా అందుతోందా లేదా చూసుకుని అందరికీ అందేలా చూడటమే వాలంటీర్ల బాధ్యతని ప్రభుత్వం చెబుతున్నా అసలు ఉద్దేశ్యం మాత్రం వేరేవుందట. ఎల్లోమీడియా ఏడుపు ఏ స్ధాయికి చేరుకున్నదంటే ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే ప్రక్రియను కూడా వాలంటీర్లే చేస్తున్నారట. ఇందులో తప్పేముందో అర్ధంకావటంలేదు. ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయించటం వైసీపీ పనా లేకపోతే కేంద్ర ఎన్నికల కమీషన్ పనా ? అనుసంధాన ప్రక్రియను చేసుకోలేని ఓటర్లు వాలంటీర్ల ద్వారా ఆపని చేయించుకుంటే తప్పేముంది ?
జగన్ వస్తేనే పథకాలు వస్తాయని వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారట. ఈ విషయాన్ని ప్రత్యేకంగా వాలంటీర్లే చెప్పక్కర్లేదు. ఒకపుడు చంద్రబాబు చేసిన ఆరోపణలతో జనాలకు అర్ధమయ్యిందిదే. సంక్షేమపథకాలను అమలు చేయటం ద్వారా జగన్ ఏపీనీ మరో శ్రీలంకలాగ మార్చేస్తున్నారని చంద్రబాబు, ఎల్లోమీడియా పదేపదే నానా రచ్చచేశారు. దాంతో జనాలకు అర్ధమయ్యిందేమంటే చంద్రబాబు వస్తే పథకాలన్నీ ఆపేస్తారని.
ఈ విధమైన ఫీడ్ బ్యాక్ ఉండబట్టే చంద్రబాబు మాటమార్చేసి ఇప్పటికైనా మరింత మెరుగ్గా పథకాలను అమలుచేస్తానని కొత్తరాగం అందుకున్నారు. ఇదేసమయంలో ఎల్లోమీడియా కూడా పథకాలు, శ్రీలంక అన్న మాటనే ఎత్తటంలేదు. ఏదేమైనా తాజా కథనంతో వాలంటీర్ వ్యవస్ధ ఎల్లోబ్యాచ్ లో ఎంతటి కలవరం కలిగిస్తోందో అర్ధమైపోయింది.