తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ప్రధాన కార్యదర్శులుగా 84 మంది, ఉపాధ్యక్షులుగా 24 మంది, ఎగ్జిక్యూటివ్ కమిటిలో 40 మందితో పాటు 26 జిల్లాలకు అధ్యక్షులను కూడా ప్రకటించేసింది. ఇంతపెద్ద జంబో కమిటీని ప్రకటించినా ఎందులోను పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు మాత్రం కనిపించలేదు. దీన్నిబట్టి పార్టీ అధిష్టానమే కోమటిరెడ్డిని పార్టీకి దూరంగా పెట్టేసిందనే అనుకోవాలి.
కోమటిరెడ్డికి ఈ పరిస్ధితి రావటానికి తన ఒంటెత్తుపోకడలనే చెప్పాలి. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో ఎంపీ వ్యవహరించిన విధానం పార్టీలోని ఎవరికీ నచ్చలేదు. అందుకనే అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీచేసింది. దానికి ఆయన ఏమి సమాధానం చెప్పారో తెలీదుకానీ తర్వాత నుండి పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఆమధ్య వెంకటరెడ్డి కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాను ఎంపీగానే పోటీచేస్తానని తాజాగా చెప్పిన ఎంపీ ఏ పార్టీ తరపున అని మాత్రం చెప్పలేదు.
మొదటినుండి కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్య అసమ్మతి వాదులుగా ముద్రపడ్డారు. తాము అనుకున్నట్లు పార్టీలో జరిగితే ఓకే లేకపోతే మాత్రం కంపుచేసేస్తారు. దీనికితోడు పీసీసీ చీఫ్ కోసం గట్టి ప్రయత్నాలుచేసిన వెంకటరెడ్డి ఫెయిలయ్యారు. అప్పటినుండి పార్టీ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి మీద కూడా మండిపోతున్నారు. అందుకనే రేవంత్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతు బురదచల్లేస్తున్నారు. రేవంత్ సారధ్యంలో పనిచేయలేక మొదటి తమ్ముడు, మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బయటకు వెళిపోయారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
మొన్నటి ఉపఎన్నికలో రాజగోపాల్ గెలిచుంటే అన్న వెంకటరెడ్డి కూడా ఈపాటికి కాంగ్రెస్ కు రాజీనామా చేసుండే వారేనేమో. కానీ వాళ్ళ ప్లాన్లన్నీ ఫెయిలవ్వటంతో ఏమిచేయాలో అర్ధంకాక ఎంపీ కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతున్నారు. ఈ మధ్యనే మీడియాతో మాట్లాడుతు తాను కాంగ్రెస్ లో యాక్టివ్ గా లేను అన్నట్లుగా చెప్పారు. సో ఇదంతా గమనించిన అధిష్టానమే వెంకటరెడ్డికి పార్టీ కమిటీల్లో ఎందులోను అవకాశం ఇచ్చినట్లు లేదు. మరి తాజా పరిణామాలతో ఎంపీ ఏమిచేస్తారో చూడాలి.