రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంపై తొందరలోనే ప్రకటిస్తామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పొత్తులగురించి నాదెండ్ల ప్రకటనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి జనసేనకు బీజేపీతో పొత్తుంది. మరే ఇతర పార్టీలతోను పొత్తులేదు. తెలుగుదేశంపార్టీతో పొత్తుపెట్టుకోవాలని పవన్ శతవిధాల ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. పవన్ ఆలోచనలన్నీ ఒకపార్టీ చుట్టూ తిరుగుతుంటే టెక్నికల్ గా పొత్తు మాత్రం మరోపార్టీతో కంటిన్యు అవుతోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పొత్తుల విషయంలొ చాయిస్ ఏముందని తొందరలో ప్రకటిస్తామని మనోహర్ చెప్పారో అర్ధంకావటంలేదు. ఎందుకంటే పొత్తుల విషయంలో పవన్ కు అసలు చాయిసే లేదు. ఉంటే బీజేపీతో మాత్రమే ఉండాలి లేకపోతే పొత్తును తెంచేసుకుని టీడీపీతో పోవాలి. ఇదితప్ప వేరే అవకాశమే లేదు. ఇంతోటిదానికి పవన్ కు ఏదో చాలా అవకాశాలున్నట్లుగా మనోహర్ బిల్డప్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.
బీజేపీతో పొత్తు కంటిన్యుచేయటం పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం అర్ధమవుతోంది. ఎందుకంటే బీజేపీకి ఓట్లూ లేవు సీట్లూ లేవు. డెడ్ వెయిట్ లాంటి బీజేపీని భుజాన మోయటం పవన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. అలాగని అదే విషయాన్ని చెప్పేసి పొత్తు బంధాన్ని తెంపేసుకునే ధైర్యం చేయటంలేదు. బీజేపీ నుండి విడిపోయిన పార్టీల పరిస్ధితి ఏమవుతుందో ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నారు. అందుకనే బీజేపీతో పొత్తు వద్దనుకునేంత ధైర్యం చేయలేకపోతున్నారు. పొత్తుల గురించి, ఒంటరిపోరాటం గురించి ప్రకటించేందుకే పవన్ భయపడిపోతున్నారు. దీంతోనే పవన్ ఎంతటి ధైర్యవంతుడో అర్ధమైపోతోంది.
ఇదేసమయంలో బీజేపీని కాదని టీడీపీతో కలిస్తే అది చంద్రబాబునాయుడుకు కూడా సమస్యగా మారే అవకాశముంది. టీడీపీని కూడా కలుపుకుని పొత్తుల్లో ఎన్నికలను ఎదుర్కోవాలన్న పవన్ ప్రతిపాదినను బీజేపీ తిరస్కరిస్తోంది. సో క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల ప్రకారం అర్ధమవుతున్నదేమంటే పొత్తుల విషయంలో పవన్ కు అసలు చాయిస్సే లేదని. చాయిసే లేని చోట తమకు చాలా అవకాశాలున్నాయని మనోహర్ బిల్డప్పులు ఇస్తుండటం భలేగా ఉంది.