అందని ద్రాక్షపళ్ళలాగ ఊరిస్తున్న మూడు పార్లమెంటు నియోజకవర్గాలపైనే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టారట. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల వైసీపీనే గెలిచిన విషయం తెలిసిందే. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం పార్లమెంటుస్ధానాల్లో మాత్రం ఓడిపోయింది. నిజానికి ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా చాలా కొద్దిపాటి తేడాతోనే అధికారపార్టీ ఓడిపోయింది. ఎంఎల్ఏ అభ్యర్ధులు కావచ్చు లేదా ఎంపీ అభ్యర్ధులు ఇంకొంచెం గట్టిగా పనిచేసుంటే పై మూడింటిలో ఒకటి లేదా రెండు సీట్ల వైసీపీ ఖాతాలో పడేవే.





అయితే ఎక్కడో తేడాకొట్టిన కారణంగానే పై మూడుచోట్ల వైసీపీ ఓడిపోయింది. లక్షల ఓట్ల మెజారిటితో ఓడిపోతే దానిగురించి పెద్దగా పట్టింపు ఉండేదికాదు. కానీ పై మూడు నియోజకవర్గాల్లోను వైసీపీ అభ్యర్ధులు సుమారుగా 8 నుండి 10 వేల ఓట్లలోపు తేడాతోనే ఓడిపోయారు. పోయిన ఎన్నికల్లోనే కాదు రాష్ట్ర విభజన నేపధ్యంలో 2014లో  జరిగిన   ఎన్నికల్లో కూడా పై మూడుచోట్లా వైసీపీ ఓడిపోయింది. అంటే రెండువరుస ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో జగన్  అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు సీట్లలో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్నారు. 





ఈ కారణంగానే వచ్చేఎన్నికల్లో కచ్చితంగా పై మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచితీరాలన్న పట్టుదలతో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. నిజానికి విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలేమీ టీడీపీకి కంచుకోటలేమీ కాదు. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ కన్నా ఇతర పార్టీలు గెలిచిందే ఎక్కువ.





ఇదే శ్రీకాకుళం నియోజకవర్గాన్ని తీసుకుంటే మాత్రం టీడీపీ ఏడుసార్లు గెలిచింది. ఇందులో 1996,98,99,2004 ఎన్నికల్లో కింజరాపు ఎర్రన్నాయుడు వరసగా నాలుగుసార్లు గెలిచారు. ఇపుడు ఆయన కొడుకు కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండుసార్లు వరసగా గెలిచారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో పై మూడు నియోజకవర్గాల్లోను గట్టి వాళ్ళని రంగంలోకి దింపి టీడీపీని ఓడించాలని జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారట. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: