మాజీమంత్రి కాపునేత గంటా శ్రీనివాసరావు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఈనెల 27వ తేదీన విశాఖపట్నంలో కాపునాడు ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరగబోతోందంటు గంటా ఈమధ్యనే ప్రకటించారు. వంగవీటి రంగా-రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే తెరవెనుక చూసుకుటున్నదంతా గంటాయే అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ కాపునాడును అడ్డంపెట్టుకుని గంటా ఒక్కసారిగా ఎందుకని యాక్టివ్ అయిపోయారు ?
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జనసేనకు మద్దతుగానే గంటా పనిచేస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో జనసేన చాలా కీలకపాత్ర పోషించబోతోందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా బలంగా నమ్ముతున్నారు. తనపార్టీ కీలకపాత్ర పోషించబోతోందని పవన్ ఎందుకు అనుకుంటున్నారు ? అందుకు తగ్గ ఆధారాలు ఏమిటనేవి ఎవరికీ తెలీదు. పవన్ సోదరుడు నాగబాబు అయితే 2024 ఎన్నికల్లో పవన్ సీఎం అయిపోతారని పదే పదే చెబుతున్నారు.
సో ఎవరి నమ్మకాలు, ఎవరి సోది ఎలాగున్నా తెరవెనుక మాత్రం ఒక వ్యవహారం నడుస్తోందట. అదేమిటంటే కాపులందరినీ జనసేనకు మద్దతుగా ఏకతాటిపైకి తీసుకురావటం. ఇప్పటివరకు కాపుల్లో మెజారిటి సెక్షన్లు జనసేనకు మద్దతుగా నిలవలేదు. పవన్ పైన ఉన్న అనుమానంతోనే కాపుల్లో చాలామంది జనసేనకు దూరంగానే ఉంటున్నారు. కాపునేతల్లో చాలామంది ప్రజారాజ్యంపార్టీ ద్వారా చిరంజీవి కొట్టిన దెబ్బను మరచిపోలేకపోతున్నారు. అంటే మెగాస్టార్ దెబ్బ తమ్ముడిమీద ఎంత బలంగా పడిందో అర్ధమవుతోంది.
ఇదే సమయంలో కాపులకు రాజ్యాధికారాన్ని సాధించటం అన్నది 2024లో కాకపోతే మరింకెప్పుడూ సాధ్యంకాదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. 2024లోనే రాజ్యాధికారం అంటే అది జనసేన ద్వారా మాత్రమే అనేది అంతర్లీనంగా జరుగుతున్న ప్రచారం. ఇందులో భాగంగానే కాపునాడును అడ్డం పెట్టుకుని జనసేన వైపుకు కాపులందరినీ మళ్ళించాలనేది కొందరు కాపు ప్రముఖుల వ్యూహంగా కనబడుతోంది. మరిది ఆచరణలో ఎంతవరకు సాధ్యమో తెలీదు కానీ ప్రయత్నాలైతే మొదలైపోయాయి. ఈ ప్రయత్నాల్లోనే గంటా చాలా బిజీగా ఉన్నట్లు అర్ధమవుతోంది. పైకి కాపునాడు బహిరంగసభ లోలోపలంతా జనసేనకు మద్దతు కూడగట్టడం. మంచిదే, ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.