ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మారిన నేపధ్యంలో కేసీయార్ ఢిల్లీలో అట్టహాసంగా పార్టీ ఆపీసును ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఆపీసులోనే రాజశ్యామల యాగం తదితర వైదిక పూజలను నిర్వహించారు. పార్టీ ఆఫీసు కాబట్టి మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. అంతాబాగానే ఉందికానీ మరి మిగిలిన పార్టీల నేతలంతా ఎక్కడ ? బీజేపీ కుంభస్ధలాన్ని బద్దలు కొడతానని భీషణ ప్రతిజ్ఞచేసి ఢిల్లీలో పార్టీ ఆఫీసు ప్రారంభ సమయంలో ప్రముఖ జాతీయనేతల్లో చాలామంది కనబడలేదు.





ఈ విషయమే ఇపుడు చర్చనీయాంశమైంది. వివిధ సందర్భాల్లో కేసీయార్ స్వయంగా ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడుకు వెళ్ళి స్టాలిన్, మహారాష్ట్రాకు వెళ్ళి శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ లాంటి వాళ్ళందరినీ కలిశారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవమంటే చాలా పెద్ద కార్యక్రమం అనేచెప్పాలి. మరింతటి పెద్ద కార్యక్రమానికి పైన చెప్పిన ముఖ్యమంత్రులు కానీ లేదా పార్టీల్లోని ప్రముఖులు కానీ కనబడలేదు.





ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కనిపించారు. అలాగే కొంతమంది రైతుసంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. మరింతటి ప్రాధాన్యతున్న కార్యక్రమంలో ప్రముఖులెవరూ ఎందుకు పాల్గొనలేదనే చర్చ పెరిగిపోతోంది. వీళ్ళెవరూ కేసీయార్ ను ఇంకా నమ్మటంలేదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కేసీయార్ కు ఇతర పార్టీల్లో క్రెడిబులిటి తక్కువనే చెప్పాలి.





ఏపార్టీతో ఎప్పుడు సఖ్యతగా ఉంటారో ఎప్పుడు దూరంగా ఉంటారో ఎవరికీ తెలీదు. ఎవరిని చేరదీస్తారో ఎందుకు ధ్వేషిస్తారో కూడా చెప్పలేరు. ఈ కారణంతోనే కేసీయార్ తో చేతులు కలపటానికి చాలామంది జాతీయస్ధాయి నేతలు సందేహిస్తున్నారు. గతంలో నరేంద్రమోడీ(బీజేపీ) కి వ్యతిరేకంగా కేసీయార్ పావులు కదపాలని చూసినా ఎవరూ మద్దతు తెలపని విషయం అందరికీ తెలిసిందే. మరి ఢిల్లీలో ఆపీసు తీసుకుని బీజేపీకి బహిరంగంగానే చాలెంజులు విసురుతున్న నేపధ్యంలో అయినా కేసీయార్ ను పైన చెప్పుకున్న ముఖ్యమంత్రులు, కీలకనేతలు నమ్ముతారా ?








మరింత సమాచారం తెలుసుకోండి: