ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు తనకు సాధ్యంకాని పనిని భుజానికెత్తుకున్నట్లు అనిపిస్తోంది. ఇంతకీ ఆ పనేమిటంటే బీజేపీని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయటం. తెలంగాణాలో టీడీపీ కెపాసిటి ఇది అని చూపించి ఏపీలో బీజేపీని లొంగదీసుకునేందుకు చంద్రబాబు పెద్ద ప్లాన్ వేసినట్లే ఉన్నారు. తన ప్లాన్ లో భాగంగానే ఖమ్మంలో బుధవారం బహిరంగసభ నిర్వహించారు. బహిరంగసభ సక్సెస్ లో పార్టీ మాత్రమే కాదు కమ్మ సామాజికవర్గం పాత్రకూడా చాలావుంది.
వచ్చేఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోతే పార్టీకి శాశ్వత సమాధి కట్టినట్లు అయిపోతుందని కమ్మోరి భయం. ఆ భయంలో నుండి పుట్టుకొచ్చిందే ఖమ్మం బహిరంగసభ నిర్వహణ. ఇదే సమయంలో తెలంగాణాలో టీడీపీ పనైపోలేదని ఇంకా బలమైన క్యాడర్ ఉందని బీజేపీకి చాటిచెప్పాలన్నది చంద్రబాబు ఆలోచన. బహిరంగసభ నిర్వహణ వరకు సక్సెస్ అయ్యింది మరి చంద్రబాబు ఆలోచనలకు బీజేపీ పడిపోతుందా ?
చంద్రబాబు ఆలోచనలను తెలుసుకోలేనంత అమాయకులు కారు కమలనాదులు. ఈ మాజీ ముఖ్యమంత్రి ప్రతి ఆలోచన బీజేపీ నేతలకు బాగా తెలుసు. ఎందుకంటే రెండుసార్లు చంద్రబాబు చేతిలో గట్టి దెబ్బతిన్న బీజేపీ నేతలకన్నా బాధితులు ఎవరుంటారు ? తెలంగాణాలో బీజేపీతో పొత్తుపెట్టుకుని టీడీపీ ఓట్లు కమలానికి వేయించి అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలన్నది చంద్రబాబు ఆలోచన. తెలంగాణాలో ఎన్నికల తర్వాతే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పుడు ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం.
అంటే తెలంగాణాలో బీజేపీకి కేసీయార్ ను బూచిగా చూపించి లొంగదీసుకుని ఏపీలో కూడా పొత్తుకు ఒప్పిస్తే జనసేన సహకారంతో అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. చంద్రబాబు వరకు ప్లాన్లు బాగానే వేస్తారు కానీ దానికి బీజేపీ నేతలు పడిపోతారా? ఎందుకంటే ఏపీలో తాము అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ ఏమీ తపించిపోవటంలేదు. పైగా 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. కాబట్టి తాముగా పొత్తు పెట్టుకుని చంద్రబాబును సీఎంను చేసి బలోపేతంచేస్తుందా ?