జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ పనైనా చాలా ఆర్భాటంగా ప్రకటిస్తారు. ఒక్కోసారి మొదలుపెడతారు కూడా. కానీ ప్రకటించిన పనైనా, కార్యక్రమమైనా ఎప్పుడు మొదలుపెడతారో మాత్రం చెప్పలేరు. ఒకవేళ మొదలుపెట్టినా ఏదో అవాంతరాల కారణంగా పక్కకుపోతోంది. ఇపుడిదంతా ఎందుకంటే వారాహి వెహికల్ యాత్ర గురించే. ఆమధ్య వారాహి వాహనం ఇంట్రడక్షన్ సినిమా టీజర్ లెవల్లో రిలీజైన విషయం అందరికీ తెలిసిందే.
టీజర్ రిలీజై నాలుగురోజుల పాటు అనవసరమైన రాద్దాంతాన్ని తలకెత్తుకుంది. తీరాచూస్తే ఇపుడు వారాహి వాహనం గురించి కానీ లేదా యాత్రగురించి కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. రాష్ట్రవ్యాప్తంగా వారాహియాత్రను పవన్ ఎప్పుడు మొదలుపెడతారో తెలీదు. ఈ విషయంలో పార్టీ నేతలకు కూడా సరైన సమాచారం లేదు. ఒకవైపు ముందస్తు ఎన్నికలనే ప్రచారం ఊపందుకుంటోంది. చంద్రబాబునాయుడు ఇదేంఖర్మ..రాష్ట్రానికి అనే కార్యక్రమంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు.
ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో, సంక్షేమ పథకాల లబ్దిపేరుతో జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దీనికి అదనంగా మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలంతా గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమంలో ఫుల్లుగా పాల్గొంటున్నారు. జనవరి 27వ తేదీ నుండి యువగళం పేరుతో నారాలోకేష్ కూడా పాదయాత్రతో జనాల్లోకి వెళుతున్నారు. ఇంతమంది ఇన్నిరకాలుగా జనాల్లోకి వెళుతుంటే పవన్ ఏం చేస్తున్నట్లు ? ఈ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.
అసలు పవన్ కు యాత్రలు చేసే ఉద్దేశ్యం ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనవరిలో కరోనా వైరస్ నాలుగో వేవ్ బాగా ఉదృతంగా ఉండబోతోందని వార్తలు వినబడుతున్నాయి. కేంద్రప్రభుత్వం కూడా జనాలందరినీ అప్రమత్తంగా ఉండాలని పదేపదే వార్నింగులిస్తోంది. ఇంతజరుగుతున్నా పవన్ వారాహియాత్రకు మాత్రం ముహూర్తం కుదిరినట్లు లేదు. యాత్రకు ఎప్పుడు ముహూర్తం కుదురుతుంది ? వారాహి ఎప్పుడు జనాల్లోకి అడుగుపెడుతుందో ఎవరికీ తెలీదు. అసలు పవన్ కన్నా తెలుసో లేదో అర్ధంకావటంలేదు. మొత్తానికి వారాహికి ముహూర్తం కుదిరేనాటికి పుణ్యకాలం గడిచిపోతుందేమో అనే సెటైర్లు పేలుతున్నాయి.