వచ్చేఎన్నికల్లో ఎలాగైనా సరే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసేయాలని కాపు సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కంకణం కట్టుకున్నట్లున్నారు. 86 ఏళ్ళ వయసులో ప్రత్యక్షంగా పవన్ కోసం ఈయన చేసేదేమీ ఉండదు. అయినా సరే పవన్ను సీఎంగా చూడాలని చేగొండి చాలా కోరికతో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే పవన్ను సీఎంగా చూడాలని జోగయ్యకు ఉన్న కోరికలో కనీసం సగం కూడా తాను సీఎం అవ్వాలని పవన్లో లేదు.
సరే ఇంతకీ జోగయ్య కోరికేమిటంటే ఎలాగైనా కాపులందరినీ జనసేనవైపుకు మళ్ళించాలని. అయితే ఆయన కోరిక ఇప్పట్లో తీరేట్లుగా లేదు. అందుకనే కాపుల్లో 85 శాతం పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నట్లు జోగయ్య కొత్తపల్లవి అందుకున్నారు. మరి జోగయ్య ఈ 85 శాతం లెక్క ఎలాకట్టారో తెలీటంలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే కాపులంతా జనసేనలోకి రావాలని, పవన్ను బలపరిచి సీఎంను చేయాలని జోగయ్య ఎప్పటినుండో బహిరంగంగానే పిలుపిస్తున్నారు.
అయినా ప్రముఖుల్లో ఎవరూ ఇంతవరకు పట్టించుకోలేదు. పట్టుమని నలుగురు కాపునేతలు కూడా జనసేనలో చేరలేదు. కాపు ప్రముఖులు జనసేనలో ఎందుకు చేరలేదో జోగయ్య సమాధానం చెప్పగలరా ? ఎందుకంటే ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు చిరంజీవితో చేతులు కలిపిన చాలామంది కాపు ప్రముఖులు దారుణంగా దెబ్బతిన్నారు. ఆ దెబ్బనుండి ఇప్పటికీ చాలామంది కోలుకోలేదట. చిరంజీవి చేతిలో తిన్నదెబ్బ మరచిపోలేదు కాబట్టే ఇపుడు తమ్ముడు పవన్ను నమ్మటంలేదని కాపుల్లోనే టాక్ నడుస్తోంది.
పవన్ కు ఎంతసేపు చంద్రబాబునాయుడు ప్రయోజనాలను కాపాడాలనే యావ తప్పితే సొంతంగా రాజకీయంగా ఎదగాలనే ఆలోచన లేదు. సొంతంగా ఎదగాలనే ఆలోచన ఎందుకు లేదంటే 24 గంటలూ రాజకీయాలు చేసేంత ఓపిక లేదుకాబట్టే. ఇవన్నీ కాపు సామాజికవర్గానికి బాగా తెలుసు కాబట్టే పవన్ కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలో జోగయ్య ఒక్కళ్ళే జాకీలేని పవన్ను పైకి లేపుదామని తెగ ప్రయత్నిస్తున్నారు. మరి చేగొండి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.