పాపం బీజేపీ పరిస్ధితి మరీ దయనీయంగా మారిపోయింది. సొంతంగా పోటీచేస్తే ఎన్ని ఓట్లు వస్తాయో కమలనాదులకు బాగా తెలుసు. పోయిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 0.56 శాతం ఓట్లు. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 4 శాతం. అంటే నోటాకున్నంత ఆదరణ కూడా బీజేపీకి  లేదని అర్ధమైపోతోంది. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలని అంటే పోటీచేయటానికి అన్నీ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి అభ్యర్ధులు కూడా దొరకరు.





ఇందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పట్టుకుని బీజేపీ నేతలు ఊరేగుతున్నారు. తమతో కలవటం పవన్ కు ఇష్టంలేదని కమలనాదులకు బాగా తెలుస్తున్నా వేరేదారి లేదు కాబట్టే పవన్ జపం చేస్తున్నారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే చంద్రబాబునాయుడుతో పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే. నిజానికి బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబుతో భేటీ అవటమే చాలా విచిత్రంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళిద్దరి భేటీపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించటం మరీ ఆశ్చర్యంగా ఉంది.





బీజేపీ ప్రధానకార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి మీడియాతో  మాట్లాడుతు చంద్రబాబుతో భేటీ వల్ల పవన్ కు బాగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పవన్ లాంటి బలమైన నేతలను తాజా భేటీ బలహీనపరుస్తుందన్నారు. చంద్రబాబు-పవన్ భేటీ విషయమై మంత్రులు, వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా జనసేనకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు.




చంద్రబాబు, పవన్ భేటీపై ఇంత మాట్లాడిన విష్ణు చివరాఖరులో వచ్చేఎన్నికల్లో జనసేన, బీజేపీ మాత్రమే కలిసి పోటీచేస్తాయని చెప్పారు. వీళ్ళభేటీలో పొత్తుల విషయం, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదన్నారు. పోనీ వాస్తవమేంటో చెప్పమంటే విష్ణు దగ్గర సమాధానంలేదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటు చంద్రబాబుతో భేటీ జరగటం ఏమిటంటే కూడా విష్ణు దగ్గర నో ఆన్సర్. అంటే పవన్ పై గట్టిగా మాట్లాడలేరు, అలాగని పవన్ భేటీలని అడ్డుకోలేరు. మొత్తానికి పవన్ ఏమిచేసినా బీజేపీ నేతలు నోరెత్తలేకపోతున్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: