మెగాస్టార్ వైఖరి ఏమిటో ఒకపట్టాన అర్ధంకావటంలేదు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఏపీ రాజకీయాల్లో ఏమి జరుగుతోందో కూడా తనకు పెద్దగా తెలియదని, తెలుసుకోవాలనే కుతూహలం కూడా తనకు లేదని స్పష్టంగా తేల్చేశారు. నూటికి నూరుశాతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. మీడియానే ఏమీతోచనపుడు తన రాజకీయ పునఃప్రవేశం గురించి కథనాలు ఇస్తోందని ఎద్దేవాచేశారు.





చిరంజీవి తాజా ప్రకటన చూసిన తర్వాత తమ్ముడి రాజకీయాలతోను, జనసేన పార్టీతోను ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పినట్లుగానే అనుకోవాల్సుంటుంది. కానీ గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతు అవరమైనపుడు తమ్ముడిని ఆదుకుంటానని చెప్పారు. ఒక అన్నగా తమ్ముడికి అవసరమైన సాయం కచ్చితంగా చేస్తానని అప్పట్లో చెప్పారు. మరి అప్పుడు చెప్పిన దానికి ఇపుడు చేసిన ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉంది. రెండింటిలో ఏది నిజమో అర్ధంకాక మెగా అభిమానులు జుట్లు పీక్కుంటున్నారేమో.





తొందరలోనే మరో ప్రకటన వస్తుందేమో తెలీదుకానీ అది వచ్చేంతవరకు లేటెస్టు ప్రకటనే నిజమనుకోవాలి. మరిదే నిజమైతే జనసైనికులకు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అవసరమైపుడు చిరంజీవి తమ్ముడు పవన్ కోసం ప్రత్యక్షంగా దిగుతారని అనుకుంటున్నారు. తమ్ముడికి అన్నకూడా తోడైతే జనసేనకు వచ్చేఎన్నికల్లో తిరుగే ఉండదనే భ్రమల్లో తేలిపోతున్నారు. అలాంటి వాళ్ళందరి నెత్తినా చిరంజీవి పెద్ద బండవేసినట్లుగానే ఉంది.





ఇంతకీ చిరంజీవి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో అర్ధంకావటంలేదు. సినిమాల్లో రాజకీయపరమైన డైలాగులు పెట్టుకోవటం వల్లే అభిమానులు జనసైనికుల్లో ఆశలు, భ్రమలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించాలనే ఆలోచన చిరంజీవిలో లేనపుడు  అలాంటి డైలాగులను ఎందుకు పెడుతున్నారు ? అభిమానులు, జనాలను మోసం చేయటానికేనా ? గాడ్ ఫాదర్ సినిమాలోని కొన్ని డైలాగుల వల్లే కదా పొలిటికల్ రీఎంట్రీ విషయమై  మీడియా+సోషల్ మీడియాలో ఆమధ్య అంత రచ్చయ్యింది. ఇపుడు చల్లగా రాజకీయాలపై ఇంట్రస్టు లేదని చెబుతున్నారంటే అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నట్లే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: