ప్రతిపక్షమంటే ప్రభుత్వాన్ని ప్రతివిషయంలోను వ్యతిరేకించాల్సిందే అన్నట్లుగా అయిపోయింది. సంబంధం ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో ఎక్కడో ఏదో చిన్న ఘటన జరిగినా వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి ప్రతిపక్షాలు నానా గోల చేస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలో సీబీఐకి జాయింట్ డైరెక్టరుగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ తాజాగా చేసిన రెండు కామెంట్లు జనాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి.





ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలోని ఉధ్థానంలో ప్రభుత్వం కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మిస్తోంది. ఈ ఆసుపత్రిలో 200 పడకలతో పాటు రీసెర్చి సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు వంశధార నది నుండి ప్రత్యేకంగా పైపులైన్లు వేస్తోంది.  మంచినీటి సౌకర్యం, రీసెర్చి సెంటర్, ఆసుపత్రి నిర్మాణం అన్నింటికి కలిపి సుమారు రు. 700 కోట్లు ఖర్చుచేస్తోంది.





ఉధ్థానం పర్యటనలో నిర్మాణ పనులను వ్యక్తిగతంగా పరిశీలించిన జేడీ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. వేలాదిమంది కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. నిజంగానే ప్రతిఒక్కళ్ళు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే ప్రతిపక్ష నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు ప్రభుత్వాన్ని అభినందించేందుకు ఎందుకనో నోరు రావటంలేదు. సంబంధంలేని విషయాల్లో జగన్ను పిక్చర్లోకి లాగి ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరు మంచి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకుని మెచ్చుకోలేకపోతున్నారు. రోడ్లపైన సభల పెట్టే విషయంలో కూడా ఇలాగే గొడవవుతోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో 1ని లక్ష్మీనారాయణ స్వాగతిస్తే చంద్రబాబు, పవన్ మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, లోపాలను కచ్చితంగా ఎత్తి చూపాల్సిందే. అవసరమైనపుడు ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందే.






ఇదే సమయంలో ప్రభుత్వపరంగా మంచి జరుగుతుంటే మెచ్చుకోవాలి. అప్పుడే ప్రతిపక్ష నేతల ఆరోపణలు, విమర్శలకు జనాలు కూడా విలువిస్తారు. మంచిని మంచిగా చెడును చెడుగా చూసినపుడే, చెప్పినపుడే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అలాకాకుండా ప్రభుత్వం ఏమిచేసినా అందులో బొక్కలే వెతుకుతాము, సంబంధంలేకపోయినా ప్రభుత్వంపై ప్రతి విషయంలోను బురదచల్లేస్తామంటే జనాల్లో విలువుండదు. వీళ్ళ ఆరోపణలు, విమర్శలకు  మొదట్లో జనాలు కాస్త పట్టించుకున్నా తర్వాత ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఇపుడు రాష్ట్రంలో జరుగుతున్నదిదే.






మరింత సమాచారం తెలుసుకోండి: