ఏడాదిన్నర ముందే అభ్యర్ధులను ప్రకటించేస్తానని ఒకపుడు చంద్రబాబునాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. నిజానికి ఇంతముందుగా టికెట్లను ప్రకటించటం చంద్రబాబు నైజంకాదు. టికెట్ ఖాయంగా పలానా నేతకే దక్కుతుందని పార్టీలో అందరికీ తెలిసినా చంద్రబాబు మాత్రం చివరినిముషం వరకు ప్రకటించరు, బీఫారంను అందించరు. అయితే ఆ పద్దతికి స్వస్ధిపలికి ముందుగానే అభ్యర్ధులను ప్రకటించేస్తానని చాలాసార్లు ప్రకటించారు. ఇప్పటికి ఓ పది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు.





అయితే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కాదుకదా చివరకు ఇన్చార్జిలను కూడా నియమించలేకపోతున్నారు. నియోజకవర్గ పదవి తర్వాత టికెట్ కోసం నేతల మధ్య తీవ్రస్ధాయిలో గొడవలు జరుగుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారే కానీ వివాదాలను పరిష్కరించటంలేదు. శ్రీకాకుళం జిల్లాలో రాజాం, కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల, కృష్ణాజిల్లాలో గుడివాడ, మైలవరం, గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు, పీ గన్నవరం లాంటి చాలా నియోజకవర్గంలో ఇన్చార్జిలను కూడా నియమించలేకపోతున్నారు. చంద్రబాబు వల్లే పార్టీ నష్టపోయేట్లుంది.





ఇన్చార్జిలను నియమించేందుకు ఇంతగా భయపడుతున్న చంద్రబాబు రేపు అభ్యర్ధులను ఏమి ప్రకటిస్తారు ? ఇటు ఇన్చార్జిలు లేదా అభ్యర్ధులనూ ప్రకటించలేక అటు పొత్తులను ఫైనల్ చేసుకోలేక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. నేతల మధ్య పెరిగిపోతున్న  వివాదాలు చూస్తుంటే పార్టీ పరిస్ధితి చివరకు రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు నేతలను చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారు. మీకే టికెట్ అంటే మీకే టికెట్ అని విడివిడిగా నేతలతో చెబుతుండటంతో ఎవరికి వాళ్ళుగా రెచ్చిపోతున్నారు.






ఇది సరిపోదన్నట్లు టీడీపీతో పొత్తుంటుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో అయోమయం మరింత పెరిగిపోతోంది. అసలే కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య జరుగుతున్న గొడవలు ఇపుడు మరింత పెరగటం ఖాయమనిపిస్తోంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బెటరనే చెప్పాలి. మంచో చెడో టికెట్ విషయంలో చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేస్తున్నారు. కానీ చంద్రబాబు వ్యవహారమే వేరేగా ఉంది.  చివరకు టికెట్ దక్కించుకోగలిగింది ఒక్కళ్ళే  అయినపుడు ఇపుడు పోటీపడుతున్న మిగిలిన నేతలంతా ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: