తెలుగుదేశంపార్టీతో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేయలేని స్ధితి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది. టీడీపీతో పొత్తుంటే కానీ వచ్చేఎన్నికల్లో తాను గెలిచేది అనుమానమే. అందుకనే గత్యంతరం లేక టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిపోయారు. టీడీపీతో పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేస్తే మళ్ళీ వీరమరణం తప్పదని స్వయంగా పవనే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఒక ఓటీటీలో తొందరలో ప్రసారమవబోయే అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ పాల్గొనటమే హాట్ టాపిక్ అయిపోయింది.
కార్యక్రమానికి సంబంధించిన షూట్ అంతా ఎప్పుడో అయిపోయింది. దానికి సంబంధించిన టీజర్ సర్క్యులేషన్లో ఉంది. దీనిపైనే ఇపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నది ప్రముఖ నటుడు, హిందుపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ. బాలయ్య చేస్తున్న ప్రోగ్రామ్ లో పవన్ అతిధిగా పాల్గొన్నారు. ఇద్దరికీ సినీ, రాజకీయ నేపధ్యముంది కాబట్టి సహజంగానే రెండు రంగాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.
అయితే అసలు ఆ షోకు పవన్ వెళ్ళటంపైనే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఎందుకంటే జనసేన శ్రేణులను ఉద్దేశించి, చిరంజీవిని ఉద్దేశించి గతంలో బాలయ్య చేసిన డ్యామేజింగ్ కామెంట్లు ఇపుడు వైరల్ గా మారాయి. గతంలో బాలయ్య ఏమన్నారంటే జనసేన శ్రేణులను అలగా జనమని, సంకరజాతి అని అవమానించారు. దాన్ని అప్పట్లోనే పవన్ స్ట్రాంగ్ గా వ్యతిరేకించారు. అయితే బాలయ్య దాన్ని పట్టించుకోలేదు.
అలాగే రెండు సందర్భాల్లో చిరంజీవిని బాలయ్య అవమానించారు. ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు చరిత్ర సృష్టించటం అందరి వల్లా కాదని తమ బ్లడ్డు వేరు తమ బ్రీడ్ వేరని చిరంజీవిని అవమానించారు. హిందుపురంలో జరిగిన లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలవలేదు. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు బాలయ్య మాట్లాడుతు ఉత్సవాల్లో పాల్గొనాలంటే ఒక స్ధాయి ఉండాలన్నారు. అప్పట్లో బాలయ్య చేసిన కామెంటు పెద్ద దుమారాన్ని రేపింది. ఇపుడు ప్రస్తుతానికి వస్తే పై సందర్భాలన్నింటినీ మరచిపోయి బాలయ్య షో కి పవన్ హాజరయ్యారంటే పొత్తుకోసం అవమానాలను దిగమింగుకున్నట్లే కనబడుతోంది.