మామూలు వైఖరికి భిన్నంగా తెలుగుదేశంపార్టీ చాలా సైలెంటుగా ఉంది. అసలు తమకు విషయంలో ఎలాంటి సంబంధంలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయం హాటుహాటుగా ఉందో అందరు చూస్తున్నదే. ఈ రాజకీయంలో టీడీపీకి కూడా పాత్రుంది. జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టర్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఒకళ్ళని తెలిసిందే. అలాంటి కోటంరెడ్డి హఠాత్తుగా జగన్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయటం, పార్టీలో తనను అవమానించారని చెప్పటం సంచలనంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎంఎల్ఏ ఒకవైపు ఆరోపిస్తుంటే మరో వైపు మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి, మాజీమంత్రి అనీల్ కుమార్ తదితరులు ట్యాపింగ్ కాదు కేవలం రికార్డింగ్ లీక్ జరిగిందంటున్నారు. ఈ నేపధ్యంలోనే వైసీపీలో అంతర్గతంగా పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో టీడీపీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాము గనుక జోక్యం చేసుకుంటే మొత్తం వ్యవహారం కంపు అయిపోతుందని చంద్రబాబునాయుడు అనుమానించిట్లున్నారు. అందుకనే తమ్ముళ్ళు ఎవరినీ నోరిప్పద్దని చెప్పినట్లున్నారు.
వచ్చేఎన్నికల్లో తాను టీడీపీ తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నట్లు స్వయంగా కోటంరెడ్డి చెప్పటం గమనార్హం. దీంతోనే కోటంరెడ్డి వైసీపీని వీడటంలో, జగన్ పై బురదచల్లటంలో టీడీపీ తెరవెనుక పాత్రకు మాత్రమే పరిమితమై మొత్తం వ్యవహారాన్ని నడిపినట్లు అర్ధమవుతోంది. వైసీపీ అంతర్గత గొడవల్లో కోటంరెడ్డికి మద్దతుగా నిలిస్తే గొడవంతా తమపైకి ఎక్కడ వస్తుందో అనే భయంతోనే టీడీపీ మౌనంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఏదేమైనా కోటంరెడ్డిని వైసీపీ నుండి వేరుచేయటంలో టీడీపీ ఒకరకంగా సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఇలాంటి వ్యూహాలను టీడీపీ ఇంకా ఎన్ని జిల్లాల్లో అమలు చేయబోతోందో అర్ధం కావటంలేదు. వైసీపీలో చిచ్చుపెట్టడంలో ఇప్పటికైతే టీడీపీ బాగా సక్సెస్ అయినట్లే అనుకోవాలి. మరి టీడీపీని నమ్ముకున్న కోటంరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలాగుంటుందో కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే చంద్రబాబును నమ్ముకుని చాలామంది రాజకీయ భవిష్యత్తు దెబ్బతినేసిందనే ఆరోపణలకు కొదవలేదు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.