కాంగ్రెస్ లో నుండి మరో బిగ్ వికెట్ పడిపోతోందా ? పార్టీవర్గాల్లో అవుననే చర్చ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణా అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎంఎల్ఏ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ తో భేటీ అయ్యారు. వీళ్ళిద్దరు వన్ టు వన్ మాట్లాడుకున్నట్లు అధికారపార్టీ వర్గాలు చెప్పాయి. వీళ్ళిద్దరి మధ్య భేటీలో ఏమి మాట్లాడుకున్నారనే విషయంపై ఇపుడు జోరుగా చర్చలు పెరిగిపోతున్నాయి.
భేటీ తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతు నియోజకవర్గంలో అభివృద్ధి గురించే మాట్లాడినట్లు చెప్పారు. ఇతర అంశాలపై కేసీయార్ ఉంటున్న ప్రగతిభవన్ కు వచ్చి కలుస్తానని తాను చెప్పినట్లు ఎంఎల్ఏ చెప్పారు. అయితే జగ్గారెడ్డి చెప్పిన మాటలను మీడియాతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా నమ్మటంలేదు. ఎందుకంటే కేసీయార్ ను కలిసిన ఇతర పార్టీల్లోని నేతలు ముందుగా చెప్పేదీమాటే. కేసీయార్ తో భేటీలో ఏమి మాట్లాడుకున్నా బయటకు వచ్చిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి గురించే మాట్లాడినట్లు చెప్పటం మామూలైపోయింది.
అయితే కొద్దిరోజుల తర్వాత పార్టీ నుండి జంప్ అయిపోతున్నారు. అప్పుడు కానీ అంతకుముందు భేటీ విషయంలో మాట్లాడుకున్న విషయాలు బయటకురావు. ఇప్పటికి కాంగ్రెస్ నేతల్లోని చాలామంది విషయంలో ఇదే జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఏమాత్రం పడటంలేదు. చాలాకాలంగా వీళ్ళిద్దరి మధ్య బహిరంగంగానే గొడవలవుతున్నాయి.
రేవంత్ కు వ్యతిరేకంగా జగ్గారెడ్డి చాలాసార్లు అధిష్టానానికి ఫిర్యాదులుచేశారు. అయితే ఏ విషయంలో కూడా అధిష్టానం రేవంత్ పై యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయంలో జగ్గారెడ్డి బాగా అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పోటీపడితే అధిష్టానం మాత్రం రేవంత్ కు పదవిని కట్టబెట్టింది. అప్పటినుండి పై ఇద్దరు రేవంత్ అంటేన మండిపోతున్నారు. వెంకటరెడ్డికి కేసీయార్ తో కూడా పడదు కాబట్టి ఏమీ మాట్లాడకుండా పార్టీలోనే ఉంటు రేవంత్ తో పాటు పార్టీని కూడా గబ్బుపట్టిస్తున్నారు. జగ్గారెడ్డికి ఆ సమస్య లేదు. కారణమేదైనా కేసీయార్ తో భేటీ అవటం సంచలనంగా మారిందనే చెప్పాలి.