ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబునాయుడుపై ఆరోపణలు, విమర్శలు చేయటంలో ముందుండే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. లోకేష్ పాదయాత్ర 400 రోజులు కచ్చితంగా పూర్తిచేయాలని కోరుకున్నారు. మధ్యలో ఎక్కడా ఆపకుండా ముందుగా చెప్పినట్లు పాదయాత్రను లోకేష్ పూర్తిచేయాలని చెప్పారు. అలాగే పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా పాదయాత్ర షెడ్యూల్ పూర్తయ్యేట్లు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తిచేశారు.





లోకేష్ పాదయాత్రపై హఠాత్తుగా జీవీఎల్ కు ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది ? ఎందుకంటే పాదయాత్ర మొదలైన తర్వాత టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందట. పాదయాత్రకు ముందు అరాకొరా ఉన్న గ్రాఫ్ లోకేష్ పుణ్యమాని పాతాళంలోకి పడిపోయిందట. టీడీపీ కోలుకోకూడని అనుకుంటే పాదయాత్ర విజయవంతం చేయటానికి ప్రభుత్వం సహకరించాలని సెటైర్లు వేశారు. లోకేష్ మాటలను, ఇస్తున్న హామీలను జీవీఎల్ గుర్తుచేశారు.





టీడీపీ పరిస్ధితి ఎలాగుందన్న విషయం లోకేష్ పాదయాత్ర తీరును చూస్తే ఎవరికైనా అర్ధమైపోతుందన్నారు. పాదయాత్ర కోసం బయటరాష్ట్రాల నుండి అద్దెమనుషులను తెచ్చుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంతజిల్లాలోనే పార్టీ పరిస్ధితి ఇలాగుంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ-జనసేన పార్టీలే అన్నారు. టీడీపీ లేచే పరిస్ధితిలో లేదని వైసీపీ ప్రభుత్వాన్ని జనాలు నమ్మటంలేదని చెప్పారు.






మంచి పరిపాలనను అందించటంలో రెండు పార్టీలు ఫెయిలైన నేపధ్యంలో జనాలకు ప్రత్యామ్నాయం కేవలం మిత్రపక్షాలు మాత్రమే అని ఎంపీ అన్నారు. డబల్ ఇంజన్ పరిపాలన కావాలని జనాలందరు కోరుకుంటున్నట్లు అనేక సందర్భాల్లో బయటపడిందన్నారు. కాబట్టి జనాలంతా వైసీపీ, టీడీపీ మాయలో నుండి బయటపడాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి నరేంద్రమోడీ సర్కార్ చూపిస్తున్న చిత్తుశుద్దిని జనాలంతా గమనిస్తున్నట్లు జీవీఎల్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు కూడా మోడీ ప్రభుత్వం తొందరలోనే నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ప్రజలను జీవీఎల్ కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: