సీనియర్ నేత, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడినపుడు చాలా విషయాలు చెప్పారు. అందులో కొన్ని మాత్రమే వాస్తవం. అయితే ఈ మొత్తంమీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో కొన్ని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేశారనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ కామెంట్లు ఏమిటంటే జనేసేన పార్టీని బయటనుండి ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాలన్నారు. అలాగే జనసేన అధికారంలోకి వచ్చే విషయాన్ని పవన్ నిర్ణయానికి వదిలేస్తే మంచిదన్నారు.
మొదటి కామెంట్ ను తీసుకుంటే జనసేనను బయటనుండి ఎవరు ప్రభావితం చేస్తున్నారు ? వెలుపలి వ్యక్తులు జనసేనను ప్రభావితం చేస్తున్నారని కన్నా అభిప్రాయపడ్డారంటే మరి పవన్ ఏమి చేస్తున్నట్లు ? బయటనుండి అంటే సొంతపార్టీ బీజేపీనా లేకపోతే చంద్రబాబునాయుడును ఉద్దేశించి కామెంట్ చేశారా ? అన్నదే అర్ధం కావటంలేదు. తన పార్టీని బయటవాళ్ళు ప్రభావితం చేస్తున్నారంటే జనసేన అధినేతగా పవన్ ఫెయిలైనట్లే కదా.
ఇక రెండో కామెంటు జనసేన అధికారంలోకి వచ్చే విషయాన్ని పవన్ నిర్ణయానికే వదిలేయాలన్నారు. ఈ కామెంటు మరీ విచిత్రంగా ఉంది. జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ కే నమ్మకంలేదు. అలాంటిది అధికారంలోకి వచ్చే విషయమై పవన్ కే నిర్ణయాన్ని వదిలేయాలని కన్నా చెప్పటం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. 22 శాతం కాపులు ఎటుంటే అధికారం అటే ఉండటం 1989 నుండి చూస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కాపుల జనాభా కన్నా చెప్పినట్లు 22 శాతం లేదు. కాపునాడులోని కీలక వ్యక్తుల లెక్క ప్రకారం కాపుల జనాభా 19 శాతం.
ఇక కాపులు ఎటుంటే అధికారం అటే అన్నది కూడా తప్పే. ఎందుకంటే బీసీలు ఒకపార్టీకి మద్దతుగా నిలబడినట్లు కాపులు ఎప్పుడూ ఒకపార్టీకి మద్దతుగా లేరు. అన్నీ పార్టీల్లోను కాపులున్నారు. కాపుల సంక్షేమం కోసం పీ శివశంకర్, మిరియాల వెంకట్రావు చిత్తుశుద్దితో పనిచేశారన్నది మాత్రం వాస్తవం. అత్యధికంగా ఉన్న కాపులను వాడుకుంటున్నారన్నది కూడా తప్పే. కాపులు తమిష్టం వచ్చిన పార్టీల్లో ఉంటున్నారు కాబట్టే అన్నీ పార్టీల్లోను కనబడుతున్నారు. జనసేనను ప్రభావితం చేసే విషయంలో కన్నా క్లారిటి ఇస్తే బాగుంటుంది.