జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలే గడపదాటదు. ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతు తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఉపఎన్నికలో పార్టీ సత్తా చాటాలన్నారు. తొందరలోనే ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు, వార్డు సభ్యుల ఉపఎన్నికల్లో జనసేన పాల్గొంటుందని చెప్పారు. మహిళలు, యువతకు టికెట్లిచ్చి ప్రోత్సహించబోతున్నట్లు ప్రకటించారు. పార్టీపట్ల నిబద్ధతతో, ధైర్యంగా పోరాటం జరిపేవారికి టికెట్లివ్వబోతున్నట్లు చెప్పారు.
అంతాబాగానే ఉంది ఎప్పుడో జరగబోయే స్ధానికసంస్ధల ఉపఎన్నికలకు పార్టీ నేతలు, క్యాడర్ ను సమాయత్తం చేయటం మంచిదే. మరి వచ్చేనెలలో జరగబోతున్న శాసనమండలి ఎన్నికల మాటేమిటి ? రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన 14 ఎంఎల్సీ స్ధానాలకు కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో స్ధానికసంస్ధల కోటాలో 9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోటాలో 3, టీచర్ల నియోజకవర్గాల కోటాలో 2 స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం పవన్ కు తెలీదా ?
స్ధానికసంస్ధల కోటాలో జరగబోయే 9 స్ధానాల ఎన్నికల్లో జనసేనకు బలంలేదన్న విషయం తెలిసిందే. కాబట్టి పై స్ధానాలకు పోటీచేయకపోయినా ఎవరు తప్పుపట్టేది లేదు. మరి మిగిలిన పట్టభద్రులు, టీచర్ల నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో జనసేన ఎందుకు పోటీచేయటంలేదు ? పై ఐదుస్ధానాలకు ఓట్లేయాల్సింది పబ్లిక్కే కదా. పబ్లిక్ అంటే గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, టీచర్లు మాత్రమే.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందని పదేపదే చెబుతున్న పవన్ ఈ ఎన్నికలను ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. తన పార్టీ తరపున అభ్యర్ధులను పోటీచేయించి గెలిపించుకోవచ్చు కదా. ఎన్నికల్లో పాల్గొంటే జనసేన బలం ఏమిటనే విషయంపైన పవన్ తో పాటు ఇతర పార్టీలకు, జనాలకు కూడా క్లారిటి వస్తుంది కదా. వైసీపీకి బుద్ధి చెప్పటానికి ఎంఎల్సీ ఎన్నికలను పవన్ ఎందుకని ఉపయోగించుకోవటంలేదో అర్ధం కావటంలేదు. ఈ ఎన్నికలను గాలికొదిలేసి ఎప్పుడు జరుగుతుందో తెలీని స్ధానికసంస్ధల ఉపఎన్నికలపైన ఎందుకు దృష్టిపెట్టినట్లు ?