సామాజికవర్గాల సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎంఎల్సీ అభ్యర్ధుల జాబితాను దాదాపు ఫైనల్ చేసినట్లు ప్రచారం పెరిగిపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం బీసీ, కాపు, రెడ్డి సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. అయితే ఎస్సీ నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం మొదటి రెండు సామాజికవర్గాలకే కల్పించబోతున్నట్లు సమాచారం. ఈ సమతూకం కూడా ప్రాంతాలవారీగా ఉండేట్లుగా జగన్ చూస్తున్నారట.
స్ధానికసంస్ధల కోటాలో తొమ్మిది ఎంఎల్సీలను భర్తీ చేయాలి. వైసీపీకి ఉన్న అవకాశాల ప్రకారం మొత్తం తొమ్మిదిస్ధానాలు కూడా అధికారపార్టీ ఖాతాలోనే పడటం ఖాయం. జగన్ దృష్టిలో పడితే చాలు ఇక ఎంఎల్సీ అయిపోయినట్లే లెక్క. అందుకనే నేతల ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలోనే ఎంఎల్సీ అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో చివరినిముషంలో ఆగిపోయింది.
పార్టీవర్గాల సమాచారం ప్రకారం బీసీ కోటాలో అమలాపురంకు చెందిన కుడిపూడి సూర్యనారాయణ, కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎంపిక దాదాపు అయిపోయినట్లే అంటున్నారు. అలాగే జమ్మలమడుగుకు చెందిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి పేరు కూడా ఖాయమైనట్లేనట. ఇక కాపు సామాజికవర్గం నుండి పాలకొల్లుకు చెందిన గున్నం నాగబాబు, అత్తిలి/ తణుకుతో బాగా సంబంధాలున్న వంకా రవీంద్ర, కారుమంచి రమేష్ లో ఇద్దరికి ఖాయమేనట. కమ్మ సామాజికవర్గానికి చెందిన చిలకలూరిపేట సీనియర్ నేత మర్రిరాజశేఖర్ కూడా ఖాయమే అంటున్నారు. ఇక ఎస్సీ కోటాలో బొమ్ము ఇజ్రాయెల్, మెరుగు మురళి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అలాగే హిందుపురంకు చెందిన కాపు నేత నవీన్ నిశ్చల్ పేరు ఫైనల్ అయినట్లే అంటున్నారు. వైశ్య సామాజికవర్గానికి ఇవ్వాలని అనుకుంటే నెల్లూరుకు చందిన ముక్యాల ద్వారకనాధ్ పేరు పరిశీలనలో ఉన్నదట. ఇదే సమయంలో మహిళా నేతలకు కూడా ఇవ్వాలని అనుకుంటే జాబితాలో పేర్లు మారిపోయే అవకాశముందని కూడా చర్చ జరుగుతోంది. ఏదేమైనా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ, కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది.