తెలుగుదేశంపార్టీలోని అసంతృప్త నేతలపై జగన్మోహన్ రెడ్డి గురిపెట్టారు. వచ్చేఎన్నికల్లో 175కి 175 సీట్లలో గెలుపే టార్గెట్ గా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను వైసీపీలోకి లాక్కోవాలని అనుకుంటున్నారు. కైకలూరు మాజీ ఎంఎల్ఏ జయమంగళ వెంకటరమణను చేర్చుకున్నారు. పార్టీలోకి జయమంగళాన్ని చేర్చుకోవటమే కాకుండా ఎంఎల్సీ పదవిని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా మాజీ ఎంఎల్ఏనే ప్రకటించారు. ఇదే దారిలో తిరుపతిలోని బీసీ నేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం కూడా టీడీపీలో నుండి వైసీపీలో చేరబోతున్నారు.
దాంతో టీడీపీలోని అసంతృప్తులకు జగన్ స్పష్టమైన సంకేతాలను పంపినట్లయ్యింది. టీడీపీని వదిలేసొస్తే వైసీపీలో సముచితస్ధానం దక్కటం గ్యారెంటీ అనే చర్చ ఇపుడు తమ్ముళ్ళల్లో జరుగుతోంది. గతంలో టీడీపీలో నుండి వచ్చిన తోట త్రిమూర్తులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతను కూడా జగన్ ఇలాగే ఎంఎల్సీలను చేశారు. అలాగే గంజి చిరంజీవికి ఆప్కో ఛైర్మన్ ఇచ్చారు. చరిత్రే కాకుండా వర్తమానంలో జరుగుతున్న డెవలప్మెంట్లపై టీడీపీలో చర్చ జరుగుతోంది.
అయితే వైసీపీలోకి వచ్చే నేతలందరికీ ఎంఎల్సీ టికెట్లు ఇవ్వలేకపోయినా ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే సముచిత స్ధానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారట. హామీ ఇస్తే జగన్ తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం ఉన్న కారణంగా కొందరు టీడీపీ అసంతృప్త నేతలు వైసీపీలోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలమైన నేతలతో వైసీపీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
సామాజికవర్గాల్లో పట్టున్న మాజీ ఎంఎల్ఏలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలపైన జగన్ ఎక్కువగా దృష్టిపెట్టినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీకి జనసేనతో పొత్తు ఖాయమన్న ప్రచారం అందరికీ తెలిసిందే. దీనివల్ల తమ్ముళ్ళల్లో ఎంతమంది మీద జనసేన దెబ్బపడుతుందో చెప్పలేకపోతున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా కొందరు సిట్టింగ్ ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి వైసీపీలో చేరితే వచ్చేఎన్నికల్లో టికెట్టే ఇస్తారో లేకపోతే పదవి హామీ ఇస్తారో అనే విషయమై తమ్ముళ్ళల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడైతే టీడీపీ బలంగా ఉందని జగన్ అనుకుంటున్నారో ఆ నియోజకవర్గాల్లో బలమైన నేతలను లాగేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి జగన్ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాల్సిందే.