తొందరలోనే బీజేపీ నుండి మరో వికెట్ పడిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు పార్టీ అధిష్టానంపై తీవ్రస్ధాయిలో వ్యాఖ్యలు చేశారు. తనలోని అసంతృప్తినంతా బయటపెట్టారు. అదికూడా కన్నా లక్ష్మీనారాయణతో భేటీ తర్వాతే. ఈమధ్యనే బీజేపీకి రాజీనామా చేసిన కన్నా 23వ తేదీన టీడీపీలో చేరబోతున్న విషయం తెలిసిందే. అలాంటి కన్నాతో రాజు భేటీ అవటం ఆశ్చర్యంగా ఉంది.





కన్నా-రాజు దాదాపు గంటపాటు మాట్లాడుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన కన్నాతో రాజు అంతసేపు మాట్లాడటమే కాకుండా తర్వాత మీడియాతో తమ కేంద్ర నాయకత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. విష్ణు మాట్లాడుతు రాష్ట్ర పార్టీలో పరిస్ధితులు ఏమీ బాగాలేదన్నారు. పార్టీలో అసలు ఏమి జరుగుతోందో కూడా తమకు అర్ధం కావటంలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చెబుదామంటే వినే పరిస్ధితి కేంద్ర నాయకత్వంలో  లేదని తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.





సో, జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే కన్నా బాటలో తొందరలోనే రాజు కూడా పార్టీని వీడటం ఖాయమనే అనిపిస్తోంది. వివిధ కారణాల వల్ల బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో విష్ణుకు పడటం లేదని పార్టీవర్గాల సమాచారం. పార్టీలోని సీనియర్ నేతల్లో చాలామంది విష్ణుకు దూరంగా ఉంటున్నారు. దాంతో రాజు పార్టీలో ఏకాకిగా మారినట్లు ఫీలవుతున్నారట. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు కారణంగా బీజేపీ తరపున గెలిచారు.




వచ్చేఎన్నికల్లో జనసేన తమతో ఉండే అవకాశం తక్కువే అని కమలనాదులు అనుమానిస్తున్నారు. జనసేన ఉండకపోతే తమకు కనీసం డిపాజిట్లు కూడా రావని బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు. చాలా చోట్ల నన్ ఆఫ్ ది ఎబో (నోటా)కు బీజేపీకన్నా ఎక్కువ ఓట్లొచ్చాయి. ఇదే పరిస్ధితి మళ్ళీ రిపీటవ్వటం ఖాయమని అందరికీ అర్ధమైపోయింది. అందుకనే అవకాశం ఉన్న వాళ్ళు కన్నాలాగ పార్టీ నుండి బయటపడుతున్నారు. మరి రాజు ఏమిచేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: