తెలంగాణాలో విచిత్రమైన డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే గవర్నర్ తమిళిసై మీద ప్రభుత్వం సుప్రింకోర్టులో కేసు వేసింది. అసెంబ్లీ, శాసనమండలిలో ఆమోదించిన బిల్లులను అద్యయనం పేరుతో గవర్నర్ తన దగ్గరే అట్టి పెట్టేసుకున్నారంటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సుప్రింకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముంది. దేశంలోని మరే రాష్ట్రంలో అయినా ఇలాంటి అంశాలపై ప్రభుత్వం గవర్నర్ పై కోర్టులో కేసు వేసిన దాఖలాలు ఉన్నాయా అన్నదే ఇఫుడు అందరినీ పట్టిపీడిస్తున్న సందేహం.
పోయిన ఏడాది సెప్టెంబర్లో అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఆ బిల్లులు ఆచరణలోకి రావాలంటే వాటిమీద గవర్నర్ సంతకం పడాల్సిందే. అందుకనే ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులను ఆమోదించాలని రిక్వెస్టు చేస్తు ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. అయితే ఆ బిల్లులను తాను అధ్యయనం చేస్తే కానీ సంతకాలు చేయటం కుదరదని తమిళిసై స్పష్టంగా చెప్పేశారు.
గడచిన నాలుగు నెలలుగా ఆ పది బిల్లులను ఏమి అధ్యయనం చేస్తున్నారో తెలీదుకానీ సంతకాలైతే దేనిమీదా కాలేదు. ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్ధను అటవీ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ చేసే బిల్లు, తెలంగాణా యూనివర్సిటీలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బిల్లు, జీఎస్టీ చట్టసవరణ, అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, మోటారు వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్ట సవరణ బిల్లు, ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు ఇప్పటికీ గవర్నర్ దగ్గరే పెండింగులో ఉన్నాయి.
ఇక్కడ విషయం ఏమిటంటే గవర్నర్ విషయంలో కేసీయార్ ప్రభుత్వం కావాలనే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తోంది. గవర్నర్ ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రులు కనబడటమే లేదు. మంత్రులు కనబడకపోయినా నష్టంలేదు కానీ కలెక్టర్, ఎస్పీలు రిసీవ్ చేసుకుని తీరాలి. అలాంటిది ప్రభుత్వం నుండి అందుతున్న ఆదేశాల కారణంగా వీళ్ళెవరూ గవర్నర్ పర్యటనలో కనబడటంలేదు. ఇలాంటి అనేక ఘటనల కారణంగా అవకాశం వచ్చింది కాబట్టి గవర్నర్ అధ్యయనం పేరుతో బిల్లులను తొక్కిపెట్టేశారు. మరి సుప్రింకోర్టు ఏమంటుందో చూడాలి.