తెలుగుదేశంపార్టీకి బలమైన క్యాడరైతే ఉంది. కాకపోతే క్యాడర్ ను నడిపించే గట్టి నేతలే లేరు. గట్టి నేతలు కూడా ఎందుకు లేరంటే చంద్రబాబునాయుడే కారణమని చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని మార్చేస్తుంటారు. అలా ఎందుకు మార్చుతారో చంద్రబాబుకైనా తెలుసో తెలీదో. ఇపుడు విషయం ఏమిటంటే వచ్చేఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చంద్రబాబు టార్గెట్ పెట్టిన నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని మాచర్ల కూడా ఒకటి.
ఇక్కడ టీడీపీ ఎంత బలహీనంగా ఉందంటే ప్రతి ఎన్నికకు ఒక కొత్త అభ్యర్ధి పోటీచేస్తుంటారు. ఎన్నిక ఎన్నికకు అభ్యర్ధి మారిపోతుండటంతో క్యాడర్లో నిస్తేజం పెరిగిపోయి ఎన్నికల సమయంలో అభ్యర్ధులను పట్టించుకోవటం మానేస్తున్నారు. దీని ఫలితంగానే వైసీపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరుగులేని విజయాలను అందుకుంటున్నారు. 2009, 2012 బై ఎలక్షన్, 2014, 19 ఎన్నికల్లో గెలుస్తునే ఉన్నారు. 2009లో టీడీపీ తరపున జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. 2012 ఉపఎన్నికలో జూలకంటిని కాదని చిరుమామిళ్ళ మధుబాబును రంగంలోకి దింపారు.
2014 ఎన్నికల్లో మధుబాబు లాభంలేదని కొమ్మారెడ్డి చలమారెడ్డిని దింపారు. 2019 ఎన్నికల్లో చలమారెడ్డి ఓడిపోతాడని అన్నపురెడ్డి అంజిరెడ్డిని పోటీచేయించారు. పార్టీ తరపున ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్ధి రావటం ఓడిపోగానే తెరమరుగైపోవటం టీడీపీలో మామూలైపోయింది. దీనివల్ల ఏమైంది ? క్యాడర్ బాగా వీకైపోయింది. ఒక ఎన్నికలో ఓడిన అభ్యర్ధినే మరుసటి ఎన్నికల్లో కూడా పోటీచేయిస్తే కొన్ని సానుభూతి ఓట్లన్నా వస్తాయి.
అయితే చంద్రబాబు కారణంగా పార్టీకి సానుభూతి ఓట్లు కూడా రావటంలేదు. 2009లో ఓడిపోయిన బ్రహ్మానందరెడ్డిని వచ్చేఎన్నికల్లో పోటీచేయించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. మామూలుగానే జూలకంటి బాగా దూకుడు నేత. ఇవతల పిన్నెల్లిది కూడా ఇదే స్వభావం. ఇందుకనే ఇద్దరి మధ్య బాగా గొడవలవుతున్నాయి. కేసులో ఇరుక్కుపోయిన జూలకంటి మాచర్లకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది చంద్రబాబు ఏరికోరి మళ్ళీ జూలకంటినే పట్టుకురావటంతో నియోజకవర్గంలో బాగా గొడవలవుతున్నాయి. మరి వచ్చేఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.