మిత్రపక్షం బీజేపీతో కంటిన్యు అవ్వాలా ? లేకపోతే బంధాన్ని తెంచుకోవాలా ? అనే విషయమై తేల్చుకునేందుకు జనసేనకు డెడ్ లైన్ దగ్గర పడుతున్నట్లే ఉంది. ఇందుకు ఎంఎల్సీ ఎన్నికలే వేదిక కాబోతోంది. ఈనెల 13వ తేదీన మూడు గ్రాడ్యుయేట్లు, రెండు టీచర్ల నియోజకవర్గాల్లో భర్తీ కావాల్సిన ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, వామపక్షాల అభ్యర్ధులు పోటీచేస్తున్నారు.
పై మూడుపార్టీలు ప్రిస్టేజియస్ గా తీసుకున్న ఈ ఎన్నికలకు జనసేన మాత్రం దూరంగా ఉంటోంది. పై మూడుపార్టీలకు స్ధిరమైన ఓటుబ్యాంకు ఉంది. జనసేనకు ఎంత ఓటుబ్యాంకు ఉందన్న విషయం తెలీదు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ, వామపక్షాలు ఏకమయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లను టీడీపీ, వామపక్షాలు తమ అభ్యర్ధులకు వేసుకుంటూనే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పరస్పరం ట్రాన్స్ ఫర్ చేసుకునేట్లుగా ఒప్పందం చేసుకున్నాయి. ఉపాధ్యాయ ఎంఎల్సీ స్ధానాలకు మాత్రమే వామపక్షాలు పోటీచేస్తున్నాయి. అలాగే పట్టభద్రుల స్ధానాల్లో మాత్రమే టీడీపీ పోటీచేస్తోంది. కాబట్టి ఓట్లు ఇచ్చిపుచ్చుకోవటం తేలికే అని అనుకుంటున్నారు.
టీడీపీ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు వామపక్షాల అభ్యర్ధులకు వేయిస్తే, వామపక్షాలు తమ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను టీడీపీకి వేయించుకునేట్లు డిసైడ్ అయ్యాయి. అయినా గెలుపు ఈజీకాదని అనుకున్నట్లున్నాయి. అందుకనే రెండుపార్టీల నేతలు జనసేనతో మాట్లాడుతున్నారు. ఎన్ని ఉన్నాయో తెలీని జనసేన ఓట్లను తమ అభ్యర్ధులకు వేయించేట్లుగా పవన్ కల్యాణ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇక్కడే అసలైన చిక్కుంది. చూడబోతుంటే పవన్ను చంద్రబాబు ఇరుకునపడేసేట్లుగానే ఉన్నారు.
అదెలాగంటే తమ ఓట్లను గనుక టీడీపీ, వామపక్షాల అభ్యర్ధులకు వేయిస్తే బీజేపీ చూస్తు ఊరుకుంటుందా ? మిత్రపక్షంగా ఉండి తమ ఓట్లను బీజేపీకి వేయించకుండా ప్రత్యర్ధి పార్టీలైన టీడీపీ, వామపక్షాలకు వేయిస్తానంటే ఎందుకు ఊరుకుంటుంది. పవన్ గనుక టీడీపీ, వామపక్షాలతో చేతులు కలిపితే బీజేపీతో జనసేన పొత్తు చిత్తయినట్లే అనుకోవాల్సుంటుంది. ఇప్పటికే రెండుపార్టీల మధ్య సఖ్యత అంతంతమాత్రంగా ఉంది. అదికాస్త తెగిపోయినట్లే అవుతుంది. చూస్తుంటే ఎంఎల్సీ ఎన్నికలే మిత్రపక్షాలకు డెడ్ లైన్ గా మారేట్లుంది. మరీ విషయంలో పవన్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.